
వేములవాడ రాజన్న ఆలయ సమీపంలో అగ్ని ప్రమాదం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వేములవాడలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పట్టణంలోని ఆలయ వసతి గృహాలకు చెందిన దుకాణాల వద్ద మంటలు అంటుకున్నాయి.
స్వామివారి జాతర జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అయితే దుకాణాల్లో ఎండబెట్టిన కొబ్బరి చిప్పలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. మంటలు చెలరేగంతో పొగలు దట్టంగా అలుముకున్నాయి.
భయాందోళనకు గురైన జనం పరుగులు తీశారు. ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం స్థానికులతో కలిసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
DETAILS
ప్రమాదంపై పోలీసుల విచారణ
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వేలం ద్వారా టెండర్ ను దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు చెందిన కొబ్బరి ముక్కలను నిత్యం ఎండబెట్టి విక్రయిస్తుంటారు.
అయితే కొబ్బరికాయలకు మంట ఎలా వ్యాపించిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు భక్తులను అప్రమత్తం చేశారు. జాతరకు వచ్చిన జనం ఆందోళనకు గురికావద్దని సూచనలు చేశారు.
కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ప్రమాద ఘటనపై ఆలయ అధికారులు ఆరా తీస్తున్నారు. దుకాణదారుడు ఎవరు, ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ ప్రారంభించారు.