Vijay Mallya-Lalit Modi: 'మనకు అన్యాయం జరిగింది...' లలిత్ మోదీ,విజయ్ మాల్యా మధ్య ఆసక్తికర సంభాషణ
భారత బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగవేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ మధ్య ఎక్స్ వేదికగా ఆసక్తికర సంభాషణ జరిగింది. విజయ్ మాల్యాకు ఇవాళ లలిత్ మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయగా, అందుకు విజయ్ మాల్యా తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా చర్చ తాజా పరిణామాలపైకి మళ్లింది. లలిత్ మోదీ తన ట్వీట్‌లో,"నా ప్రియమైన మిత్రుడు విజయ్ మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం.మనిద్దరం వాటిని ఎదుర్కొన్నాం.భవిష్యత్ విజేతవు నీవే . సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నా" అంటూ పోస్టు చేశారు. దీనికి విజయ్ మాల్యా స్పందిస్తూ,"థ్యాంక్యూ నా ప్రియమైన మిత్రుడా!మనం దేశానికి ఎంతో చేశాం, కానీ మనకు అన్యాయం జరిగింది," అంటూ బదులిచ్చారు.
లలిత్ మోడీ చేసిన ట్వీట్
ఈడీ సహాయంతో బ్యాంకులు రూ.14,131 కోట్లు వసూలు
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పార్లమెంట్‌లో చేసిన ప్రకటన ప్రకారం, భారత బ్యాంకులను మోసం చేసిన నేరస్థుల ఆస్తులను జప్తు చేసి రూ.22,280 కోట్లు బ్యాంకుల్లో జమ చేశారని వెల్లడించారు. ఇందులో విజయ్ మాల్యాకు చెందిన రూ.14 వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని వివరించారు. అయితే, ఈ ప్రకటనపై విజయ్ మాల్యా సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. విజయ్ మాల్యా, "కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాలు రూ.6,203 కోట్లు, వడ్డీ రూ.1,200 కోట్లు మాత్రమే. కానీ ఈడీ సహాయంతో బ్యాంకులు రూ.14,131 కోట్లు వసూలు చేశాయి. అప్పు కంటే రెట్టింపు తీసుకున్నారన్నమాట. అయినా నన్ను ఆర్థిక నేరస్థుడిగా చూస్తున్నారు," అంటూ ట్వీట్ చేశారు.
వీరి సంభాషణపై నెటిజన్లు విమర్శలు
ఇక లలిత్ మోదీ కూడా విజయ్ మాల్యాను మద్దతు తెలుపుతూ, "నా స్నేహితుడు దీనిని కూడా అధిగమిస్తాడు. బర్త్‌డే శుభాకాంక్షలు," అంటూ ట్వీట్ చేశారు. అయితే వీరి సంభాషణపై నెటిజన్లు విమర్శలు చేస్తూ, ట్రోలింగ్ చేస్తున్నారు. మరికొందరేమో విజయ్ మాల్యా తీరుపై మండిపడుతున్నారు
విజయ్ మాల్యా ట్వీట్ కి లలిత్ మోడీ జవాబు
2010లో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ
లలిత్ మోదీ, 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న ఆయన, తాను న్యాయపరమైన సమస్యల కారణంగా దేశం విడిచినట్లు కాకుండా, దావూద్ ఇబ్రహీం నుంచి వచ్చిన బెదిరింపుల వల్ల దేశం విడిచానని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. నిర్మలా సీతారామన్ ప్రకటన ప్రకారం, ఈడీ, బ్యాంకులు సంయుక్తంగా ఎగవేతదారుల ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తున్నాయి. ఈ చర్యలతో బ్యాంకులకు కొంత ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా, నీరవ్ మోదీ ఆస్తుల నుంచి రూ.1,000 కోట్లు, మెహుల్ చోక్సీ ఆస్తుల నుంచి రూ.2,566 కోట్ల విలువైన ఆస్తులను కూడా జప్తు చేసి వేలం వేయబోతున్నట్లు తెలిపారు.