TVK: నేడు కాంచీపురంలో జిల్లాలో విజయ్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో తన రాజకీయ పునాదిని బలపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్న నటుడు దళపతి విజయ్, 'తమిళిగ వెట్రి కళగం' (TVK) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పార్టీ స్థాపన తర్వాత భారీ స్థాయిలో అభిమానులతో, కార్యకర్తలతో బహిరంగ సభలు నిర్వహిస్తూ విజయ్ రాజకీయ రంగంలో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన ర్యాలీ సందర్భంగా ఇరుకైన ప్రదేశంలో సభను ఏర్పాటు చేయడం వల్ల జరిగిన తొక్కిసలాట విషాదాంతమై, 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన విజయ్‌కు పెద్ద అప్రతిష్టగా మారింది.
Details
2వేల మంది కార్యకర్తలతో సమావేశం
ఈ నేపథ్యంతో, విజయ్ మళ్లీ ప్రజల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. నవంబర్ 23న కాంచీపురం జిల్లాలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలతో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్ కోసం పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అంతేకాకుండా, సమావేశానికి ఎవరైనా హాజరవ్వాలంటే క్యూఆర్ కోడ్ కలిగిన ప్రత్యేక పాస్ తప్పనిసరి అని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కూడా అందించినట్లు సమాచారం.
Details
ప్రచార కార్యక్రమాలు వేగవంతం
ఈ సమావేశంలో TVK అధినేత విజయ్, పార్టీకి చెందిన కీలక నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నట్లు తెలిసింది. మరోవైపు, డిసెంబర్ 4న భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ ప్రయత్నించినప్పటికీ, భద్రతా కారణాలతో పోలీసులు అనుమతి నిరాకరించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, TVK ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తోంది. ర్యాలీలు, భారీ సభలకు అనుమతులు ఆలస్యంగా లభిస్తున్నందున, వీలైనన్ని ఇండోర్ మీటింగ్‌లు పెట్టి ప్రజలను చేరుకునే వ్యూహాన్ని పార్టీ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.