Vijaya Shanthi : సొంతింటికి వచ్చేసిన విజయశాంతి.. ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం
టాలీవుడ్ సినీస్టార్, సీనియర్ నేత విజయశాంతి కాంగ్రెస్ గూటికి వచ్చేశారు. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి, నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. అనంతరం రాములమ్మకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విజయశాంతి రాకతో హస్తం క్యాడర్ మరింత బలోపేతమవుతుందని సీనియర్ నేతలు అభిప్రాయపడ్డారు.గతంలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతి 2020లో బీజేపీలోకి వెళ్లారు. కేసీఆర్ సర్కారును గద్దె దించాలన్న లక్ష్యంతో కషాయం ధరించినా రాజకీయ కారణాల దృష్ట్యా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవలే హైదరాబాద్ మోదీ సభలకు కూడా ఆమె గైర్హాజరయ్యారు.
రాములమ్మ రాజకీయ నేపథ్యం ఇదే :
1998లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు విజయశాంతి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయ జీవితం ప్రారంభ సమయంలో బీజేపీలో చేరిన విజయశాంతి, 2005లో సొంతంగా తల్లి తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. 2009లో ఆ పార్టీని కేసీఆర్ నాటి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయించేశారు. అనంతరం మెదక్ లోక్ సభ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కేసీఆర్ పొమ్మనలేక పొగబెట్టాడని ఆరోపిస్తూ టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ క్రమంలోనే 2014లో కాంగ్రెస్ గూటికి చేరింది. ఇటీవలే 2020లో బీజేపీలో చేరారు. మూడేళ్ల తర్వాత తెలంగాణ ఎన్నికల వేళ ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు.