Swachh Vayu Survekshan 2024: స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2024 ర్యాంకింగ్స్.. విజయవాడ 9వ ర్యాంక్.. 26వ స్థానంలో విశాఖపట్నం
విజయవాడను భారీ వర్షాలు, వరదలు అతలాకుతలంగా మార్చిన నేపథ్యంలో, అక్కడి ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. నష్టంపై మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపించిన ప్రభుత్వం, సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో, విజయవాడ దేశంలో 9వ ర్యాంకు సాధించిందని తెలిసింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2024లో, 10 లక్షల మందికి పైబడిన జనాభా ఉన్న నగరాల్లో విజయవాడ 9వ ర్యాంకు పొందింది. తర్వాతి స్థానంలో విశాఖపట్టణం 26వ ర్యాంకులో నిలిచింది.
47 నగరాల్లో ఈ ర్యాంకులు
సీపీసీబీ నగరాల్లో బయోమాస్, రోడ్లపై దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి నెమ్మదిగా వెలువడే ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగలు, ప్రజా చైతన్యం, గాలిలో ధూళి ఘనత ఆధారంగా ర్యాంకులు కేటాయించింది. దేశవ్యాప్తంగా పది లక్షలకు పైబడిన జనాభా ఉన్న 47 నగరాల్లో ఈ ర్యాంకులు ప్రకటించారు. విజయవాడ 182 మార్కులతో 9వ స్థానాన్ని, విశాఖపట్నం 163 మార్కులతో 26వ స్థానాన్ని పొందింది. ఈ రెండు నగరాలు మెరుగైన ర్యాంకులను సాధించాయి. ఏపీలో 3 నుండి 10 లక్షల జనాభా ఉన్న43నగరాల్లో,గుంటూరు 185 మార్కులతో 10వ,రాజమండ్రి 178 మార్కులతో 17వ,నెల్లూరు 171.5 మార్కులతో 19వ,కర్నూలు 163.5 మార్కులతో 23వ,కడప 161.7 మార్కులతో 25వ,అనంతపురం 149.3 మార్కులతో 33వ స్థానాల్లో ఉన్నాయి.
మొదటి మూడు స్థానాలలో సూరత్,జబల్‌పుర్,ఆగ్రా
3 లక్షల లోపు జనాభా ఉన్న 40 పట్టణాల్లో, ఒంగోలు 170 మార్కులతో 17వ, చిత్తూరు 153.9 మార్కుతో 21వ, శ్రీకాకుళం 153.4 మార్కులతో 22వ, విజయనగరం 146.5 మార్కులతో 24వ స్థానాలను సాధించాయి. 2023 ఏప్రిల్ 1 నుండి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా సీపీసీబీ ఈ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైబడిన జనాభా ఉన్న నగరాల్లో సూరత్(గుజరాత్),జబల్‌పుర్ (మధ్యప్రదేశ్),ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్)మొదటి మూడు స్థానాలలో ఉన్నాయి. 3నుండి 10లక్షల జనాభా ఉన్న నగరాలలో ఫిరోజాబాద్(ఉత్తర్‌ప్రదేశ్),అమరావతి(మహారాష్ట్ర), ఝాన్సీ(ఉత్తర్‌ప్రదేశ్) అగ్రస్థానాలలో ఉన్నాయి. 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో,రాయ్‌బరేలి(ఉత్తర్‌ప్రదేశ్),నల్గొండ(తెలంగాణ),నలాగఢ్ (హిమాచల్‌ప్రదేశ్)ముందరి స్థానాలలో నిలిచాయి. ఈ నగరాలకు రూ.1.50కోట్ల నుండి రూ.12.5లక్షల వరకు నగదు బహుమతులు అందించబడతాయి.