Himachal crisis: మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా.. హిమాచల్‌లో ముదురుతున్న సంక్షోభం
హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభం మరింత ముదురుతోంది. తాజాగా సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన విషయాన్ని వెల్లడించారు. సుఖు ప్రభుత్వంపై విక్రమాదిత్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించే ప్రయత్నం కూడా జరిగిందని ఆయన చెప్పడం గమనార్హం. హిమాచల్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడే విక్రమాదిత్య సింగ్. ఆయన సుఖు ప్రభుత్వంలో పీడబ్ల్యూ మంత్రిగా ఉన్నారు. తాము ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగానే ఉన్నామన్నారు. ప్రస్తుతానికి తాను ఈ ప్రభుత్వంలో కొనసాగడం సరికాదని చెప్పాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. అందుకే మంత్రివర్గం నుంచి బయటకు వెళ్తున్నట్లు చెప్పారు.
ఎమ్మెల్యేల గొంతు నొక్కారు : విక్రమాదిత్య సింగ్
హిమాచల్‌లో అందరి సహకారంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విక్రమాదిత్య సింగ్ అన్నారు. ప్రభుత్వ పనితీరు గురించి తాను ఎప్పుడు నోరు విప్పలేదన్నారు. తనకు పదవి ముఖ్యం కాదని, ప్రజల నమ్మకమే ముఖ్యమన్నారు. ఎమ్మెల్యేల గొంతు నొక్కే ప్రయత్నం జరిగిందని, అందుకే నేడు ఈ పరిస్థితి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ అంశాన్ని పార్టీ హైకమాండ్ ముందు తాను ఎప్పటికప్పుడు లేవనెత్తుతూనే ఉన్నానని వివరించారు. కానీ హైకమాండ్ తీసుకోవలసిన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోలేదన్నారు. వాగ్దానాలు ఇవ్వగానే సరిపోదని, వాటిని పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రిని తానెప్పుడూ గౌరవిస్తానని విక్రమాదిత్య అన్నారు. ఏడాది పాటు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచామన్నారు. కానీ తమకు అవమానించారని ఆయన పేర్కొన్నారు.