ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కాగ్ అభ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్ ) ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవస్థ సరికాదని చెప్పుకొచ్చింది. 2020-21 ఆర్థిక ఏడాదికి గానూ కాగ్ సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వార్డు కమిటీలు లేకుండా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కాగ్ చెప్పుకొచ్చింది. అలాగే సచివాలయాల వ్యవస్థలు అనేవి పాలన వికేంద్రీకరణ కోసమేనని తన నివేదికలో కాగ్ చెప్పింది.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం: కాగ్
గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను 2019 జులైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. కానీ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కాగ్ స్పష్టం చేసింది. ఇలా క్షేత్రస్థాయిలో ఏదైనా వ్యవస్థను ఏర్పాటు చేస్తే.. అది స్థానిక స్వపరిపాలనపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని కాగ్ వెల్లడించింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులతో వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని కాగ్ అభిప్రాయపడింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరి నుంచి అమరావతికి ఎలాంటి బడ్జెట్‌ను అందించలేదని కాగన్ తన నివేదికలో పేర్కొంది.