Page Loader
Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ
మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ

Manipur violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2024
02:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

మణిపూర్‌లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. సెప్టెంబర్ 10 ఉదయం 11 గంటల నుండి ఇంఫాల్ పశ్చిమ, ఇంఫాల్ తూర్పు, తౌబాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. విద్యార్థుల నిరసనలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవల కోసం కొన్నింటికి మినహాయింపులు కూడా ఇచ్చారు. ఆరోగ్యం, విద్యుత్, నీటి సరఫరా, విమాన ప్రయాణికుల కదలికలు, మీడియా సిబ్బంది వంటి వారికి కర్ఫ్యూ నుండి మినహాయింపు ఇవ్వడం గమనార్హం. ఇంఫాల్ లోయలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. విద్యార్థుల నిరసనలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మకంగా మారాయి.

Details

రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు సెలవు

తౌబాల్ జిల్లాలో సోమవారం జరిగిన నిరసనల్లో పోలీసులు ఒక విద్యార్థిపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఇక మణిపూర్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు సెప్టెంబర్ 9 మరియు 10 తేదీలలో మూసివేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నింటికీ వర్తించనుంది. గత వారం మణిపూర్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. జిరిబామ్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మరణించగా, మరో ప్రాంతంలో 63 ఏళ్ల వ్యక్తి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రాత్రి కంగ్‌పోక్పి జిల్లాలో కూడా రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో 46 ఏళ్ల మహిళ మరణించింది.