West Bengal panchayat polls: హింసాత్మకంగా పశ్చిమ బెంగాల్ పంచాయతీ పోలింగ్; అట్టుడుకుతున్న గ్రామాలు
పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు రణరంగంగా మారాయి. రాజీకీయ కక్షలతో నెత్తురోడుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన నలుగురు కార్యకర్తలు శుక్రవారం మరణించగా, కాంగ్రెస్, సీపీఎంకి చెందిన వారు తమపై ప్రత్యర్థి పార్టీలు దాడి చేశాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత నడుమ శనివారం పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ పోలింగ్ జరుగుతోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సుమారు 5.67 కోట్ల మంది ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ముర్షిదాబాద్ జిల్లాలో చెలరేగిన హింస కారణంగా దీన్ని తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతంగా గుర్తించారు. జిల్లాలోని కపస్‌దంగా ప్రాంతంలో టీఎంసీ కార్యకర్త బాబర్ అలీని హత్య చేశారు.
పోలింగ్ కేంద్రాన్ని ధ్వంసం చేసిన దృశ్యం
ఆగని దాడుల పర్వం
ముర్షిదాబాద్ జిల్లాలోని రెజీనగర్‌లో శుక్రవారం జరిగిన నాటు బాంబు పేలుడులో ఒక టిఎంసీ కార్మికుడు మరణించాడు. ఇలేద జిల్లాలోని ఖర్‌గ్రామ్‌లో మరో తృణమూల్ కార్యకర్తను కత్తితో పొడిచి దుండగులు హత్య చేశారు. తూర్పు మిడ్నాపూర్‌లోని సోనాచురా గ్రామపంచాయతీకి చెందిన తృణమూల్ బూత్ ప్రెసిడెంట్ దేవ్‌కుమార్ రాయ్‌పై బీజేపీ కార్యకర్త సుబల్ మన్నా, అనుచరులు దాడి చేశారు. జల్పైగురిలో తృణమూల్ అభ్యర్థిపై బీజేపీ కార్యకర్తలు దాడికి చేసినట్లు టీఎంసీ ఆరోపించింది. కూచ్ బెహార్‌లో, రాంపూర్‌లో గణేష్ సర్కార్‌గా గుర్తించబడిన టిఎంసీ బూత్ కమిటీ ఛైర్మన్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. కూచ్ బెహార్ జిల్లాలోని ఓక్రాబరి గ్రామంలో సీపీఎం కార్యకర్త హఫీజుర్ రెహమాన్‌పై దుండగులు కాల్పులు జరపడంతో గాయపడ్డారు.
టీఎంసీ చేసిన ట్వీట్
70వేల మంది రాష్ట్ర పోలీసులు, 600 కేంద్ర కంపెనీల కేంద్ర బలగాల మోహరింపు
రాష్ట్రంలోని మూడంచెల పంచాయతీ వ్యవస్థలో 73,887 స్థానాలకు జరిగే ఎన్నికల్లో మొత్తం 2.06 లక్షల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జూన్ 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చెదురుమదురు హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఈ ఘటనల్లో 15 మందికి పైగా మరణించారు. 22 జిల్లాల్లో 63,229 గ్రామ పంచాయతీ స్థానాలు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు ఉన్నాయి. డార్జిలింగ్, కాలింపాంగ్ వంటి 20 జిల్లాల్లో 928 జిల్లా పరిషత్ స్థానాలు ఉన్నాయి. దాదాపు 70,000 మంది రాష్ట్ర పోలీసులతో పాటు కనీసం 600 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల కోసం మోహరించారు.