విశాఖపట్నం: కుప్పకూలిన భవనం; ముగ్గురు మృతి; పుట్టినరోజు నాడే దుర్ఘటన
విశాఖపట్నం కలెక్టరేట్ సమీపంలోని రామజోగిపేటలో బుధవారం అర్థరాత్రి ఘోరం జరిగింది. మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఛోటు, సాకేతి అంజలి, సాకేతి దుర్గా ప్రసాద్‌గా పోలీసులు గుర్తించారు. అంజలి 10వ తరగతి చదువుతుండగా, ఆమె సోదరుడు దుర్గాప్రసాద్ ఇంటర్ చదువుతున్నాడు. గాయపడిన వారిని కొమ్మిశెట్టి శివశంకర, సాకేటి రామారావు, సాకేటి కళ్యాణి, సున్నపు కృష్ణ, సతిక రోజారాణిగా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్), పోలీసులు, రెవెన్యూ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఒకే కుటుంబంలో అన్నాచెల్లెళ్లు మృతి
రామజోగిపేటలో నివాసం ఉంటున్న రామారావు, కల్యాణి దంపతుల పిల్లలే సాకేతి అంజలి, సాకేతి దుర్గా ప్రసాద్. బుధవారం అంజలి పుట్టిన రోజు. వేడుకలను చేసుకొని సంబంరాల్లో మునిపోయిన కుటుంబ సభ్యులను ఈ ప్రమాదం ఒక్కసారిగా విషాదంలోకి నెట్టి వేసింది. అప్పటిదాకా సంతోషంగా కళ్లముందు తిరిగిన పిల్లలు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం రామారావు, కల్యాణి దంపతులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారని పోలీసులు తెలిపారు. భవనం కూలిన సమయంలో ఎనిమిది మంది లోపల ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.