
Vishakapatnam: విశాఖలో త్వరలోనే డబుల్ డెక్కర్ బస్సులు.. సముద్రతీరాన్ని కనువిందు చేసేందుకు సిద్ధమైన ప్రత్యేక టూర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం క్రమంగా అభివృద్ధి చెందుతుండగా, విశాఖపట్టణం నగరం ప్రకృతి అందాలతో ప్రపంచంలో పేరు తెచ్చుకుంటోంది. రోజూ వేలాది మంది పర్యాటకులు విశాఖకు తరలివస్తుండటంతో, ఈ రంగాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు అధికారులు కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా, నగరంలో రెండు అంతస్తుల ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వీటిలో నుంచి సముద్రతీరపు అందాలను దగ్గరగా ఆస్వాదించే అరుదైన అవకాశం నగర వాసులకు, సందర్శకులకు కలగనుంది. ఇది నగర పర్యటనకు కొత్త మజిలీగా మారనుంది.
వివరాలు
20 ప్రదేశాలకు ఈ బస్సుల సేవలు
ఇప్పటికే ముంబయి, గోవా, ఢిల్లీ వంటి దేశంలోని ప్రముఖ పర్యాటక నగరాల్లో 'హాప్ ఆన్ - హాప్ ఆఫ్' బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు విశాఖ కూడా ఇదే తరహాలో ముందుకు సాగుతోంది. బీచ్ రోడ్ వెంబడి ఉన్న ముఖ్యమైన 20 ప్రదేశాలకు ఈ బస్సుల సేవలు అందించనున్నాయి. పర్యాటకులు ఏదైనా స్టాప్ వద్ద దిగిపోయి, తిరిగి అదే బస్సులో తిరిగి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఈ విధంగా వారు బస్సు ద్వారా పూర్తిగా నగరంలోని పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తూ, మళ్లీ తమ గమ్యానికి చేరుకోవచ్చు. ఈ బస్సులు పూర్తిగా విద్యుత్‌తో నడిచే విధంగా రూపొందించబడ్డాయి. దీంతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణాన్ని పరిరక్షించే ప్రక్రియలోనూ ఇవి ఒక భాగంగా నిలవనున్నాయి.
వివరాలు
అవసరమైతే మరిన్ని బస్సులు
ప్రస్తుతం రెండు బస్సులు సిద్ధంగా ఉండగా, వీటిని పర్యాటక శాఖ మంత్రి సహా సంబంధిత ఉన్నతాధికారులు ఇప్పటికే పరిశీలించారు. అవసరమైతే మరిన్ని బస్సులను తీసుకురావడానికి కూడా ప్రణాళికలు తయారవుతున్నాయి. విశాఖలో ఇప్పటికే కైలాసగిరి, రుషికొండ బీచ్, ఏరీస్ హిల్, సబ్‌మారిన్ మ్యూజియం వంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒకే రోజు బస్సు టూర్ ద్వారా చుట్టి చూసే అవకాశం ఈ డబుల్ డెక్కర్ బస్సుల ద్వారా కలుగనుంది. ప్రత్యేకంగా పై అంతస్తు ఓపెన్ డెక్‌గా ఉండటంతో, అక్కడ వుంటూ సముద్రతీరాన్ని శీతల హవాలో చూసే అనుభవం సందర్శకులకు మరపురాని ఘట్టంగా మిగలనుంది. కూర్చోవడానికి అందుబాటులో ఉండే సౌకర్యవంతమైన సీట్లు, శీతలీకరణ వ్యవస్థ (ఏసీ)తో ప్రయాణం మరింత ఆనందంగా మారుతుంది.
వివరాలు
విశాఖకు వచ్చే పర్యాటకులకు అదనపు ఆకర్షణ
ప్రస్తుతం విశాఖపట్నం 'సిటీ ఆఫ్ డెస్టినేషన్'గా పేరొందుతోంది. ఈ డబుల్ డెక్కర్ బస్సుల ప్రారంభంతో నగర పర్యాటక రంగం మరింత బలోపేతం కానుంది. ప్రత్యేకంగా పర్యాటకుల కోసం రూపొందించిన ఈ బస్సులు నగరంలోని టూరిజం రంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని అధికారులు భావిస్తున్నారు. అందుబాటు ధరలకే ప్రయాణ అవకాశం ఈ 'హాప్ ఆన్ - హాప్ ఆఫ్' బస్సులకు సంబంధించిన టికెట్ ధరలు,ఆన్‌లైన్ బుకింగ్ విధానం, బస్సుల రూట్ మ్యాప్, ప్రయాణ సమయాలు వంటి వివరాలను పర్యాటక శాఖ అధికారులు త్వరలోనే ప్రకటించనున్నారు. ఒకసారి టికెట్ కొనుగోలు చేస్తే,ఆ రోజు మొత్తంలో ఎప్పుడైనా,ఎక్కడైనా ఎక్కి దిగే సౌలభ్యం ప్రయాణికులకు లభిస్తుంది.ఈ ప్రత్యేక సౌకర్యంతో విశాఖ పర్యాటక రంగం మరో మెట్టు ఎక్కబోతోంది.
వివరాలు
అందుబాటు ధరలకే ప్రయాణ అవకాశం
రాబోయే రోజుల్లో సముద్రపు అలల దృశ్యాలకు సాక్షిగా డబుల్ డెక్కర్ బస్సుల్లో విహరించే ఆ తీపి ప్రయాణం కోసం విశాఖ వాసులు, పర్యాటకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.