LOADING...
Yoga Andhra: 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి
21న రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి

Yoga Andhra: 21న రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు.. ఒకేసారి రెండు రికార్డుల సాధనకు కృషి

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 10, 2025
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

యోగా అనే దివ్యమైన ప్రక్రియను భారతదేశం ప్రపంచానికి పరిచయం చేసింది. దీనిని ప్రతిరోజు జీవితంలో భాగంగా మార్చుకుంటే, శారీరకంగా కూడా మానసికంగా కూడా ఆరోగ్యాన్ని పొందడం సాధ్యమవుతుంది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఈ క్రమంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వివరాలు 

యోగాంధ్ర-2025: విశిష్ట కార్యక్రమాలు 

గత నెల నుంచే 'యోగాంధ్ర-2025' అనే పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 21న ఉదయం 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో లక్షలాది వేదికల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రెండు కోట్ల మందిని ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా చేసేందుకు యోచిస్తోంది. విశాఖపట్టణంలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అక్కడ 5 లక్షల మంది హాజరయ్యేలా ప్రత్యేక ప్రాంగణాలను సన్నద్ధం చేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా యోగా సాధకులు సమిష్టిగా పాల్గొంటారు.

వివరాలు 

గిన్నిస్ బుక్ కోసం విశేష కృషి 

విశాఖలో జరిగే ఈ కార్యక్రమాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు చేయాలని ప్రభుత్వ యత్నిస్తోంది. అదేవిధంగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ (ఏయూ) ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించబోయే 'సూర్య నమస్కారాలు'ను వరల్డ్ బుక్ రికార్డ్స్‌లో నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి పంచాయతీ నుంచి ప్రజల తరలింపు అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం జిల్లాల నుంచి విశాఖకు ప్రజలను తరలించేందుకు సుమారు 12 వేల బస్సులను సిద్ధం చేస్తున్నారు. ఈ జిల్లాల్లోని ప్రతి పంచాయతీ నుంచి ప్రజలు పాల్గొనాలన్న ఉద్దేశంతో సమగ్ర ప్రణాళికలు రచిస్తున్నారు.

వివరాలు 

ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ స్టిక్కర్ 

గిన్నిస్ రికార్డుకు అనుగుణంగా హాజరైన వారి గణన చేయడం కోసం విశాఖలో జరిగే కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉన్న స్టిక్కర్‌ను అందించనున్నారు. ఈ స్టిక్కర్ల ఆధారంగా గిన్నిస్ సంస్థ ప్రతినిధులు హాజరుల సంఖ్యను గణిస్తారు. ఈ కార్యక్రమాన్ని 3 వేల సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో పర్యవేక్షించనున్నారు. అలాగే పాముల బెడదను నివారించేందుకు అటవీ శాఖ 'స్నేక్ క్యాచర్లు'ను కూడా రంగంలోకి దించనుంది.

వివరాలు 

50 వేల విద్యాసంస్థల్లో యోగా కార్యక్రమాలు 

రాష్ట్రవ్యాప్తంగా 21వ తేదీన లక్ష ప్రదేశాల్లో యోగాసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వీటిలో సుమారు 50 వేల వరకు విద్యాసంస్థలే ఉన్నాయి. మిగతా ప్రదేశాల్లో మైదానాలు, కన్వెన్షన్ హాల్స్, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో కూడా యోగా కార్యక్రమాలు కొనసాగుతాయి. అదే సమయంలో విశాఖ నావికాదళ సిబ్బంది నౌకలపై యోగా చేస్తారు. కార్యక్రమం జరుగుతున్న రోజున వర్షం కురిసినా, ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కారణంగా విశాఖలో 5 లక్షల మంది హాజరయ్యే కార్యక్రమం గిన్నిస్ రికార్డుగా నమోదు కావడంలో అంతరాయం ఏర్పడకూడదన్న ఉద్దేశంతో, ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వర్షం ప్రభావం లేకుండా జర్మన్ హ్యాంగర్లను సిద్ధం చేస్తున్నారు.