chhattisgarh: ఎన్‌ఎండీసీ నగర్నార్ ప్లాంటుకు.. విశాఖ ఉక్కు ఉద్యోగులు
ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండీసీ (నేషనల్ మినరల్ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్) నగర్నార్ ప్లాంటుకు 500 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయంలో ఆర్‌ఐఎన్‌ఎల్ పంపిన లేఖకు ఎన్‌ఎండీసీ పూర్తిగా అంగీకారం తెలిపింది. మొదటి విడతగా వంద మంది ఎగ్జిక్యూటివ్‌లను పంపించాలని ఎన్‌ఎండీసీ ఛైర్మన్ అమితవ ముఖర్జీ ఈ నెల 15న స్టీల్ ప్లాంటు తాత్కాలిక సీఎండీ ఏకే బాగ్చీకి లేఖ రాశారు. ఈ ఉద్యోగులకు బేసిక్ పేతోపాటు డీఏ అందించి, షేర్డ్ పద్ధతిలో వసతి కల్పించనున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
మానవ వనరుల కొరత
విశాఖ ఉక్కు పరిశ్రమలో మానవ వనరులు 20వేల నుండి ప్రస్తుతం 12,500 మందికి తగ్గాయి. సీనియర్ మేనేజర్ కింద క్యాడర్ ఈ-4 ఉద్యోగుల్లో 200 మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేశారు. నెలకు 20 మంది పదవీ విరమణ పొందుతున్నారు. అత్యంత కీలకమైన బ్లాస్ట్ ఫర్నేస్, కోకోవన్, షిప్పింగ్, స్టోర్స్, ఆర్థిక శాఖల్లో ఎక్కువ ఉద్యోగుల అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు. డిప్యుటేషన్‌పై 15 ఏళ్ల సీనియార్టీ ఉన్న ఉద్యోగులు వెళితే, ఈ కీలక విభాగాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
లేఖలోని అంశాలు అస్పష్టత
నగర్నార్ ప్లాంటు మెకాన్ ఓఅండ్‌ఎంలో ఉంది. డిప్యుటేషన్‌పై వెళ్లే ఉద్యోగులు ఎన్‌ఎండీసీ, మెకాన్ సంస్థల్లో ఎవరి కింద పనిచేయాలి? ఒకవేళ నగర్నార్ ప్లాంటును కేంద్రం అమ్మేస్తే, వెళ్లిన ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అక్కడ జీతాలు, ఇక్కడ జీతాల్లో వ్యత్యాసం ఉండడం వల్ల ఏ జీతం చెల్లిస్తారు? షేర్డ్ వసతి అందించినా, విశాఖలో కుటుంబ సభ్యులు ఉంటే క్వార్టర్ల అద్దె ఎలా చెల్లించాలి? వైద్య సదుపాయాలు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలపై స్పష్టత లేనందున ఉద్యోగుల సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 'ఏ ఉద్యోగినీ బయటకు తరలించకూడదు. ఇక్కడే ఉంచాలి. ఉత్పత్తిని పూర్తిస్థాయిలో కొనసాగించాలి' అని సీఐటీయూ తరపున ఆయోధ్యరామ్ డిమాండ్ చేశారు.