Loading...
Visakhapatnam: విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు.. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు
విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు.. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు

Visakhapatnam: విశాఖ వేదికగా భారీ పెట్టుబడులు.. 2.5 లక్షల మందికి ఉద్యోగాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
09:00 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణంలో ఈ నెల 12, 13 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశముంది. ఈ సదస్సులో రూ.11లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 160కి పైగా సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. వీటి ద్వారా సుమారు 2.5లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సదస్సు నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు దేశవిదేశాల్లో 11 రోడ్‌షోలు నిర్వహించింది. 127 కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపింది.అలాగే 15 జీ2జీ,17 రౌండ్‌టేబుల్‌ సమావేశాలను నిర్వహించింది. విశాఖలో జరిగే ఈ సదస్సుకు వివిధ దేశాలకు చెందిన 18మంది మంత్రులు,40 మంది అంతర్జాతీయ వక్తలు, 58 దేశాల నుంచి 3,800 మందికిపైగా ప్రతినిధులు హాజరుకానున్నారు.

వివరాలు 

ముఖ్య అతిథిగా అమిత్‌ షా

పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు ప్రపంచ వాణిజ్యం నుంచి క్వాంటమ్‌ సాంకేతికత వరకు పలు కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు.

వివిధ రంగాల్లో నిపుణుల అభిప్రాయాలు, సూచనలు తీసుకుని వాటిని ఆచరణలోకి తీసుకెళ్లేలా చర్చలకు ప్రాధాన్యమివ్వనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), కేంద్ర ప్రభుత్వ సంస్థ డీపీఐఐటీ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి.

ఈ నెల 12న జరిగే సదస్సు ప్రారంభోత్సవానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

13న జరిగే ముగింపు కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్‌ పాల్గొంటారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సదస్సుకు అధ్యక్షత వహించనుండగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

వివరాలు 

ఆరు కీలక రంగాలపై చర్చలు

కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, ప్రహ్లాద్‌ జోషి, రామ్మోహన్‌ నాయుడు, శర్బానంద సోనోవాల్, చిరాగ్‌ పాసవాన్‌ కూడా హాజరుకానున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ సహకారం, ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణహిత ఇంధనం, వ్యవసాయం, ఆహార భద్రత వంటి అంశాలపై ప్రముఖులు చర్చించనున్నారు.

ప్రధానంగా ఆరు కీలక రంగాలకు సంబంధించిన అంశాలపై మేధోమథనం జరగనుంది.

ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం) ఆధ్వర్యంలో 'భారత ఇంధనరంగం భవిష్యత్తు' అనే అంశంపై ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు.

జపాన్, యూఏఈ, రష్యా, ఐరోపా, ఆఫ్రికా దేశాలతో ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆయా దేశాల మంత్రులతోనూ చర్చలు నిర్వహిస్తారు.

ADVERTISEMENT

వివరాలు 

ఆరు కీలక రంగాలపై చర్చలు

మహిళల ఆర్థికాభివృద్ధి, సాధికారతపై 'ఏపీ ఉమెన్‌ అండ్‌ గ్రోత్‌ సమిట్‌ 2026- ది నెక్ట్స్‌ లీప్‌' పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. టైమ్‌ మ్యాగజైన్‌ ఆధ్వర్యంలోనూ మరో ప్రత్యేక కార్యక్రమం జరగనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రముఖ జర్నలిస్టు పాల్కీ శర్మ ప్రత్యేక ముఖాముఖి నిర్వహించనున్నారు. 'యంగ్‌ ఆంధ్రా-త్రైవింగ్‌ ఆంధ్రా' పేరుతో మంత్రి నారా లోకేశ్‌ పాల్గొనే ప్రత్యక్ష పాడ్‌కాస్ట్‌ కార్యక్రమం కూడా ఉంటుంది.

సదస్సులో భాగంగా ఏర్పాటు చేసే ఏపీ పెవిలియన్, ఎంఎస్‌ఎంఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని పారిశ్రామిక అవకాశాలు, చిన్న పరిశ్రమల ఉత్పత్తులు, పర్యాటక ప్రాంతాలు, సంస్కృతీ సంప్రదాయాలను ప్రదర్శించనున్నారు. ఈ ప్రదర్శనను ఈ నెల 14న ప్రజలు సందర్శించేందుకు అనుమతించనున్నారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రాంతీయ సదస్సుల్లో రూ.85,561 కోట్ల ఒప్పందాలు

రాష్ట్రవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖపట్నం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో ప్రాంతీయ భాగస్వామ్య సదస్సులు నిర్వహించారు.

వీటిలో మొత్తం 195 సంస్థలు రూ.85,561.42 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో రూ.5,714.06 కోట్ల విలువైన 68 ప్రాజెక్టులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

వివరాలు 

ఆరు రంగాల్లో ప్రత్యేక దృష్టి

వాణిజ్యం, పెట్టుబడులు, గ్లోబల్‌ వాల్యూ చైన్‌లు: ప్రపంచ వాణిజ్య వ్యవస్థలో వస్తున్న మార్పులు, పునర్వ్యవస్థీకరణ, ఉమ్మడి ఆర్థికాభివృద్ధి కోసం భారత్‌-యూరప్‌ భాగస్వామ్యంపై చర్చించనున్నారు.

విశ్వసనీయ భాగస్వామ్యాలు, భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సహకారం: మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో విశ్వసనీయ భాగస్వామ్యాల ఏర్పాటు, సాంకేతికత, అభివృద్ధి అంశాలపై చర్చలు జరగనున్నాయి.

సాంకేతికత, ఆవిష్కరణలు, పరిశ్రమల భవిష్యత్తు: ఆధునిక తయారీ రంగం, రోబోటిక్స్, అంతరిక్ష పరిశ్రమ, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.

వివరాలు 

ఆరు రంగాల్లో ప్రత్యేక దృష్టి

ప్రతిభ, నైపుణ్యాలు, గ్లోబల్‌ మొబిలిటీ: భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దడంపై చర్చించనున్నారు.

శుద్ధ ఇంధనం, సుస్థిర అభివృద్ధి: భారత ఇంధన రంగ భవిష్యత్తుకు అవసరమైన చర్యలు, పర్యావరణానికి అనుకూలమైన ఇంధన వనరులు, స్థిరమైన అభివృద్ధి అంశాలపై మేధోమథనం నిర్వహించనున్నారు.

వ్యవసాయం, ఆహార భద్రత, బయో ఎకానమీ: వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలు, ఆహార భద్రత, బయో ఎకానమీ అభివృద్ధిపై చర్చలు జరగనున్నాయి.

వివరాలు 

గత ఒప్పందాలు.. పెట్టుబడుల అమలు ఇలా..

2024 జూన్‌ నుంచి 2026 అక్టోబరు వరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో మొత్తం రూ.22.6లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 714 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకుంది.

వీటిలో 526ప్రాజెక్టులకు ఇప్పటికే భూ కేటాయింపులు పూర్తయ్యాయి.ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.17.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి.

శంకుస్థాపన,నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న 303 ప్రాజెక్టుల ద్వారా రూ.7.1 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

వీటి ద్వారా సుమారు 7.7 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

మరోవైపు రూ.5.4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 188 ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రభుత్వ అనుమతులు, ప్రణాళికల దశలో ఉన్నాయి.

ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాల్లో దాదాపు మూడోవంతు ప్రాజెక్టులు ఇప్పటికే అమలులోకి వచ్చాయి.

ADVERTISEMENT