Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ కొత్త సీఎంగా విష్ణుదేవ్ సాయి
ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రిగా విష్ణు దేవ్ సాయి బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2003 నుంచి 2018 వరకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టి.. ఈ సారి ఓబీసీ, లేదా గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బీజేపీ ముఖ్యమంత్రిని చేస్తుందని మొదటి నుంచి ప్రచారం అవుతోంది. అనుకున్నట్లుగానే గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్ సాయిని ముఖ్యమంత్రిగా ఫైనల్ చేశారు. కొత్తగా ఎన్నికైన 54 మంది బీజేపీ ఎమ్మెల్యేల కూడా విష్ణు దేవ్ సాయి పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఛత్తీస్‌గఢ్ జనాభాలో గిరిజనులు 32 శాతం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర జనాభాలో గిరిజనుల వాటా 32శాతం. ఈ ఎన్నికల్లో షెడ్యూల్డ్ తెగలకు(ఎస్టీ) రిజర్వ్ చేసిన 29 సీట్లలో 17స్థానాలను బీజేపీ గెలుచుకుంది. 2018లో గిరిజనులకు రిజర్వ్ చేసిన మూడు స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకుంది. గిరిజనుల ప్రాబల్యం ఉన్న సుర్గుజా డివిజన్‌లో ఈ ఎన్నికల్లో మొత్తం 14స్థానాల్లో కమలనాథులు విజయం సాధించారు. 2018లో ఈ డివిజన్‌లో మొత్తం 14స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం విశేషం. సుర్గుజా డివిజన్ నుంచే విష్ణుదేవ్ సాయి ప్రాతినిధ్య వహిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకు గానూ 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 2018లో 68 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ ఈ సారి 35 సీట్లకు పడిపోయింది.