AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌లో సమ్మెకు దిగిన వాలంటీర్లు
ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు సమ్మె సైరన్ మోగించారు. ఇన్నాళ్లు జగన్ ప్రభుత్వానికి వెన్నెముకగా నిలిచిన వాలంటీర్లు ఇప్పుడు.. సమ్మెకు దిగడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. వేతనం పెంపుదల, సర్వీసులు క్రమబద్ధీకరించడం లేదని వాలంటీర్లు మంగళవారం నుంచి కొన్ని జిల్లాల్లో సమ్మెకు దిగారు. సమ్మెలో భాగంగా ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 'ఆడుదాం ఆంధ్రా' కార్యక్రమానికి వాలంటీర్లు దూరంగా ఉన్నారు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రమే సమ్మె ప్రభావం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో వైసీపీ నాయకులు ఒత్తిడి మేరకు వాలంటీర్లు సమ్మెలో పాల్గొనడం లేదని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారు చెబుతున్నారు. 2019ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీరికి నెలకు రూ.5వేల గౌరవ వేతనం ఇస్తోంది.
పారిశుద్ధ్య కార్మికులు కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ ఒప్పంద సిబ్బంది కూడా మంగళవారం నుంచే నిరవధిక సమ్మెకు దిగడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఏపీ వ్యాప్తంగా 50వేల మంది సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. మంగళవారం పలు చోట్ల రోడ్డెక్కి నిరసన తెలిపారు. పనికి తగ్గ వేతనం ఇవ్వాలని, రూ. 26వేలకు వేతనం పెంచాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. పారిశుద్ధ్య కార్మికుల కోసం చేసిందేమీ లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం పెరుగుతోందన్నారు. కార్మికుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.