తెలంగాణలోని ఆ 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్: ఈసీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని తగ్గించినట్లు పేర్కొంది. నవంబర్ 30న పోలింగ్ డే రోజున సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. కానీ ఆ 13 నియోజకవర్గాలు సమస్యాత్మక ప్రాంతాలు కావడం వల్ల ఆ ప్రాంతాల్లో సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌కు అనుమతిస్తున్నట్లు ఈసీ వెల్లడించింది. 13 నియోజకవర్గాల జాబితాలో సిర్పూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, ఆసిఫాబాద్, మంథని, ములుగు, భూపాలపల్లి, పినపాక, ఇల్లెందు, భద్రాచలం అశ్వారావుపేట, కొత్తగూడెం ఉన్నాయి. ఈ ప్రాంతాలు గోదావరి పరివాహక ప్రాంతాలతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడం గమనార్హం.