
Mamata Banerjee: వక్ఫ్ చట్టానికి బెంగాల్‌లో చోటు లేదు.. మమతా బెనర్జీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వక్ఫ్ (సవరణ) చట్టంపై తన స్పష్టమైన వైఖరిని మరోసారి తెలియజేశారు. ఈ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేయమని తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చిన నేపథ్యంలో, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.
శనివారం మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో ప్రజలు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.
రోడ్లను దిగ్బంధించి, భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని రాళ్లదాడులు చేయడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది.
ఈ నేపథ్యంలో పోలీసులు 110 మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. శాంతిని పరిరక్షించేందుకు సంబంధిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
Details
బెంగాల్ లో అమలు చేయం
ఈ పరిణామాలపై మమతా బెనర్జీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ''ప్రతి జీవితం విలువైనదే. రాజకీయాల కోసం అల్లర్లకు దిగితే, అది సమాజానికి హానికరం. అలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తాం.
కొన్ని పార్టీలు మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయి. మతం అంటే మానవత్వం, శాంతి, సామరస్యం. అందరం కలసికట్టుగా జీవించాలి.
మీరు వ్యతిరేకిస్తున్న చట్టం మేము చేసినది కాదు, అది కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం. దీనిపై సమాధానాలు కావాలంటే కేంద్రాన్ని ప్రశ్నించాలి. బెంగాల్‌లో ఈ చట్టాన్ని అమలు చేయడం లేదని ఆమె అన్నారు.
మరోవైపు, శుక్రవారం మొదలైన నిరసనలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది సాధారణ నిరసన కాదని, కొన్ని శక్తులు గందరగోళం సృష్టించడానికి ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తున్నట్లు పేర్కొంది.