
Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ఘోరమైన అగ్నిప్రమాదం ప్రజలను తీవ్రంగా కలచివేసింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో మే 18 అర్థరాత్రి శ్రీకృష్ణ పెరల్స్ జువెలరీ షాపులో ఈ మంటలు చెలరేగాయి. గోవింద్ మోడీ, సునీల్ మోడీ, పంకజ్ మోడీలకు చెందిన ఈ షాపులో జరిగిన ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోవడం ఘోర విషాదంగా మారింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నేడు ప్రత్యేక దర్యాప్తు బృందం ఘటన స్థలాన్ని సందర్శించి పరిశీలించనుంది.
Details
ఇరుకైన మార్గాలు, అగ్ని నివారణ లేని భవనం
ప్రమాదానికి ప్రధాన కారణంగా భవన యజమాని నిర్లక్ష్యమే ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. భవన ఫస్ట్ ఫ్లోర్‌లో ఏసీ కంప్రెషర్ అధిక వేడి కారణంగా షార్ట్ సర్క్యూట్ జరగగా, అదే సమయంలో లీకైన గ్యాస్ సిలిండర్‌లో మంటలు రావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ భవనంలో అగ్ని నివారణ సదుపాయాలు లేకపోవడమే కాకుండా, పైకప్పులో ఉండే డెకోలం రూఫింగ్ వల్ల మంటలు మరింత విస్తరించాయి. అంతేగాక భవన ప్రవేశద్వారం, అంతస్తులకు వెళ్లే మార్గాలు బహు ఇరుకుగా ఉండటంతో లోపల ఉన్నవారు బయటకు రాలేకపోయారు. ఇది ప్రాణనష్టం పెరగడానికి ప్రధాన కారణమైందని అగ్నిమాపక శాఖ వెల్లడించింది.
Details
పాత భవనాల భద్రతపై తలెత్తుతున్న ప్రశ్నలు
ఈ ఘటనపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, గతంలోనూ విద్యుత్ సరఫరాలో వచ్చిన సమస్యలపై యజమానిని ఎన్నోసార్లు అప్రమత్తం చేసినా తగిన చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు ప్రమాదానికి కారణమైన భవనాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘోర ఘటన, నగరంలోని పాత భవనాల్లో భద్రతా చర్యలపై తీవ్రమైన ప్రశ్నలు రేపుతోంది. భవిష్యత్‌లో ఇలాంటి విషాదాలు మళ్లీ జరగకూడదంటే, అధికారులు తక్షణమే గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ పెరిగుతోంది.