Taj Mahal: భారీ వర్షాల కారణంగా తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!
దిల్లీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీని కారణంగా 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ స్మారక చిహ్నం తాజ్ మహల్ వద్ద నీటి లీకేజీ కలకలం రేపింది. అయితే, ప్రధాన గోపురానికి ఎటువంటి నష్టం జరగలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ప్రధాన గోపురంలో నీటి లీకేజీ జరిగినా, తనిఖీల్లో ఎటువంటి నష్టం కనిపించలేదని ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్‌కుమార్ పటేల్ పేర్కొన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా గోపురాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు.
పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
ఇక వరదల కారణంగా తాజ్ మహల్ సమీపంలోని తోట నీట మునిగిపోవడం ఆందోళన కల్గిస్తోంది. పర్యాటకుల సురక్షిత సందర్శన కోసం స్మారక చిహ్నం చుట్టూ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆగ్రాలో గురువారం 151 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. ఇది గత 80 ఏళ్లలో 24 గంటల్లో నమోదైన అత్యధిక వర్షపాతంగా ఉందని పేర్కొన్నారు. ఈ భారీ వర్షాల కారణంగా జాతీయ రహదారులు జలమయం కాగా, పంటలు నీటమునిగాయి. ఇక ఆగ్రా ప్రాంతంలోని అన్ని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు.