Madhya Pradesh: బీజేపీకి ఓటు వేయని వారికి తాగునీరు బంద్: మధ్యప్రదేశ్ మంత్రి
మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న ముగిసింది. రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత అశోక్‌నగర్ జిల్లాలో వెలువడిన కథనాలు సంచలనంగా మారాయి. జిల్లాలోని కొన్ని గ్రామాల్లో తాగు నీటి సరఫరా కోసం ప్రభుత్వం పైపులైన్లను వేసింది. ఆయా గ్రామాల ప్రజలు బీజేపీకి ఓటు వేసినట్లు ప్రమాణం చేయకపోతే ఆ పైపుల ద్వారా వచ్చే తాగునీటిని బంద్ చేస్తామని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముంగవాలి అసెంబ్లీ నుంచి ఈ సారి బ్రిజేంద్ర సింగ్ యాదవ్ పోటీ చేసారు. నియోజకవర్గంలోని నాయకెడ గ్రామంలో డిసెంబర్ 3 వరకు గ్రామస్థులకు నీటి సరఫరాను నిలిపివేయాలని బ్రిజేంద్ర సింగ్ ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఖండించిన మంత్రి.. నిజమే అంటున్న గ్రామస్తులు
ఈ వార్తలను బ్రిజేంద్ర సింగ్ ఖండించారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ నీరు అందించేందుకు ప్రభుత్వం నుంచి తాను నాలుగు గొట్టపు బావులు వేయించినట్లు పేర్కొన్నారు. అయితే ఇలాంటి దుష్ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. అయితే మంత్రి ప్రకటనతో పలువురు గ్రామస్తులు విభేదిస్తున్నారు. బీజేపీకి ఓటు వేశారా? లేదా? అని గ్రామస్తులను కొందరు గ్రామ నాయకులు ప్రశ్నించినట్లు వారు పేర్కొన్నారు. బావుల మోటారును నాయకులు అడ్డుకున్నట్లు చెప్పారు. బీజేపీ నాయకులు ఎన్నికల తర్వాత మోటార్లను పూర్తిగా నిలిపివేసినట్లు గ్రామస్తులు వాపోయారు. ఈ ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. ఓట్లు వేయని వారని బీజేపీ నీళ్లివ్వకుండా చంపేందుకు సిద్ధమైనట్లు బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.