YS Sharmila: వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుంచి షర్మిళను బహిష్కరిస్తున్నాం : గట్టు రామచంద్రరావు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పై సొంత నాయకులే తిరుగుబాటు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీకి నేతలు మూకుమ్మడిగా గుట్టు రామచంద్రరావు ఆధ్వర్యంలో రాజీనామాలు ప్రకటించారు. అసలు పార్టీయే తమదని, షర్మిలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వైస్సార్టీపీ నాయకులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో భేటీ అయ్యారు. షర్మిలను నమ్మి మోసపోయామని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు అని ఇన్నాళ్లు గౌరవించామని, తెలంగాణలో ఆమెకు స్థానంలో లేదని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులు షర్మిలను సపోర్ట్ చేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతున్నామని గుట్టు రామచంద్రరావు చెప్పారు.
వైఎస్ షర్మిల కన్నా కేఎల్ పాల్ చాలా బెటర్
ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీలో షర్మిలకు సభ్యత్వమే లేదని, వైఎస్సార్ తెలంగాణ పార్టీ షర్మిలది కాదని వెల్లడించారు. భవిష్యత్తులో ఆమె ఎక్కడ పోటీ చేసినా తాము ఓడిస్తామన్నారు. షర్మిలతో పోల్చుకుంటే కేఏ పాల్ చాలా బెటర్ అని వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల తడిగుడ్డతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానుల గొంతును కోశారని వాపోయారు. కార్యక్రమంలో వైఎస్సార్టీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.