
Bhanakacherla: పోలవరం రెండో దశ పూర్తయ్యాకే బనకచర్లపై ఆలోచించవచ్చు: ప్రాజెక్టు అథారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి,ప్రస్తుతం ఉన్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆమోదం పొందిన డీపీఆర్‌కు భిన్నంగా ఉన్న అంశాలను అందులో చేర్చడంతో పాటు, సంబంధిత అనుమతులు కూడా పొందాలని సూచించింది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గం 41.15 మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన తొలి దశకు రూ.30,436.95 కోట్ల వ్యయంతో అనుమతి ఇచ్చింది. అయితే ఈ తొలి దశతోనే ప్రాజెక్టు ఉద్దేశ్యాలన్నీ నెరవేరవు. పైగా, రెండో దశలో 45.72 మీటర్ల నీటి నిల్వ స్థాయికి చేరాకే బనకచర్ల అనుసంధానంపై ఆలోచించగలమని ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది.
వివరాలు
పోలవరం ప్రాజెక్టులో తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు
ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు డైరెక్టర్ మన్ను జి. ఉపాధ్యాయ్, కేంద్ర జల సంఘానికి లేఖ రాసి, బనకచర్ల ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టుపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. పోలవరం-బనకచర్ల అనుసంధానం ప్రీ ఫీజిబులిటీ నివేదిక విషయాలు 2009లో ఆమోదం పొందిన పోలవరం డీపీఆర్ ప్రకారం, 449.78 టీఎంసీల నీటి వినియోగానికి అనుమతి లభించింది. ప్రాజెక్టులో కుడి ప్రధాన కాలువకు 11,654 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,123 క్యూసెక్కుల ప్రవాహ సామర్థ్యం అనుమతించగా, రెండు కలిపి 17,560 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మాణం సాగుతోంది. ప్రాజెక్టు పూర్తయ్యాక తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు, దాని కింద ఉన్న ఆయకట్టు పోలవరం ప్రాజెక్టులో భాగంగా వస్తాయి.
వివరాలు
22.58 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నదే లక్ష్యం
సంవత్సరం 200 టీఎంసీల వరదనీటిని మళ్లించి, 7.41 లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందించాలనే లక్ష్యం ఉంది. అంతేకాదు, ఇప్పటికే ఉన్న 22.58 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నదే లక్ష్యం. ఈ ప్రాజెక్టులో భాగంగా, పోలవరం కుడికాలువకు సమాంతరంగా 18,000 క్యూసెక్కుల సామర్థ్యం గల కొత్త వరద కాలువను తవ్వాలని ప్రతిపాదించారు. ఈ కాలువకు, కుడికాలువకు 166.50 కిలోమీటర్ల పొడవులో ఒకే గట్టు (ఎంబాంక్‌మెంట్) ఉండేలా తీర్చిదిద్దుతారు. తాడిపూడి కాలువ కూడా 40 కిలోమీటర్ల మేర ఈ వ్యవస్థలో అనుసంధానమవుతుంది
వివరాలు
ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలు ఇవీ..
బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్న పోలవరం డీపీఆర్‌లో భాగంగా లేదు. కాబట్టి, అదనంగా తరలించాల్సిన నీటి పరిమాణాన్ని, అందుబాటులో ఉన్న వనరులను స్పష్టంగా అధ్యయనం చేయాలి. అంతర్రాష్ట్ర నీటి వివాదాలపై విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టును ప్రతిపాదించేముందు ట్రైబ్యునల్ ఇచ్చిన అవార్డులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉద్దేశించిన అన్ని ప్రయోజనాలు నిజంగా నెరవేరుతున్నాయా అనే అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో 83,607 హెక్టార్లకు సాగునీరు, 130 గ్రామాలకు త్రాగునీరు అందిస్తున్నారు. పోలవరం నిర్మాణం పూర్తైన తరువాత, తాడిపూడి వ్యవస్థ పూర్తిగా పోలవరంలో భాగమవుతుంది. కుడికాలువ, తాడిపూడి కాలువలకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను సమగ్రంగా అధ్యయనం చేయాలి.
వివరాలు
ఈ నేపథ్యంలో పరిశీలించాల్సిన అంశాలు ఇవీ..
1980లో గోదావరి జలాల ఒప్పందాన్ని ఆధారంగా పోలవరం ఆపరేషన్ షెడ్యూలు రూపొందించబడింది. ఇప్పుడు 200 టీఎంసీల నీటిని మళ్లించే ప్రతిపాదన నేపథ్యంలో ఆ షెడ్యూలును తిరిగి సమీక్షించాల్సిన అవసరం ఉంది.