దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ
దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆ చర్య దేశంలో ప్రతిపక్షాల పట్ల మరింత సానుభూతిని పెంచుతుందన్నారు.ఈ సైద్ధాంతిక పోరులో అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామని స్పష్టం చేశారు. ఏజెన్సీల దాడులపై ఐక్యంగా పోరాడతామని రాహుల్ చెప్పారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ బుధవారం దిల్లీలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. వీరి వెంట జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు లాలన్ సింగ్ కూడా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
చరిత్రాత్మకమైన సమావేశం జరిగింది: ఖర్గే
నితీష్ కుమార్ మంగళవారం దిల్లీకి చేరుకున్నారు. ఆయన కొందరు ప్రతిపక్ష నాయకులను కలవనున్నారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్/ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తేజస్వి యాదవ్ కూడా దిల్లీలోనే ఉన్నారు. ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ చరిత్రాత్మకమైన సమావేశం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేస్తామని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా పునరుద్ఘాటించారు. దిల్లీలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో నితీశ్ కుమార్ భేటీ అయిన ఒకరోజు తర్వాత ఈ సమావేశంలో జరగడం గమనార్హం.