LOADING...
PM Modi: ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం 
ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం

PM Modi: ప్రపంచ మార్కెట్‌పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్‌ల వేళ మోదీ సందేశం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 15, 2025
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో జాతిని ఉద్దేశించి మాట్లాడిన మోదీ, నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్‌లో భారత సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఇది. ప్రపంచ మార్కెట్‌ను మనం పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. తక్కువ ధర, అధిక నాణ్యత లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకు సాగాలని మోదీ పేర్కొన్నారు. ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో శక్తి వృథా చేయకుండా, మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టి సారించాలని సూచించారు.

Details

స్వదేశీ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలి

వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల విక్రయాలపై దృష్టిపెట్టాలని, ప్రపంచం భారత పురోగతిని గమనిస్తోందని తెలిపారు. ప్రభుత్వ విధానాలలో మార్పులు అవసరమైతే సూచించాలని పౌరులను కోరారు. రైతు వ్యతిరేక విధానాలను సహించబోనని స్పష్టం చేసిన మోదీ, రైతులు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలక స్తంభాలని, అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఇంధన రంగంపై మాట్లాడుతూ, దేశాన్ని స్వయంసమృద్ధి వైపు నడిపించాల్సిన అవసరం ఉందని, సోలార్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వైపు అడుగులు వేయాలని తెలిపారు. అణు ఇంధనం వైపు కూడా దేశం వేగంగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

Details

అణు విద్యుత్ లో ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలి

అణు విద్యుత్‌లో ప్రైవేట్‌ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం డీజిల్‌, పెట్రోల్‌ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు అవుతున్నాయని, కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించడమే లక్ష్యమని చెప్పారు. దిగుమతులు తగ్గితే స్వయంసమృద్ధి సాధ్యమని, ప్రపంచమంతా కీలక ఖనిజాల కోసం పోటీపడుతోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో, స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల్లో మరో రికార్డు మోదీ సొంతం చేసుకున్నారు. ఈసారి 103 నిమిషాలపాటు ఏకధాటిగా ప్రసంగించి, స్వాతంత్య్ర దినోత్సవాల్లో అత్యధిక సమయం మాట్లాడిన ప్రధానిగా నిలిచారు. గత ఏడాది ఆయన 98 నిమిషాలపాటు ప్రసంగించారు.