అకాల వర్షాలకు తడిసిన పంటను కొనుగోలు చేస్తాం: మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణలో అకాల వర్షాలు రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. చేతికొచ్చిన పంట వర్షార్పణం అవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో పంట కల్లానికే పరమితమైంది. దీంతో రైతులు తమ పంటను కొనుగులో చేయాలని ప్రభుత్వాన్ని కోరగా, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.
తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మార్చేందుకు ఆదేశాలు
తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మార్చేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి గంగుల పేర్కొన్నారు. దాదాపు 1.28లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్‌గా మార్చేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చినట్లు చెప్పారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం 17లోపు తేమ శాతం ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుంది. అయితే 20శాతం తేమ ఉన్న ధాన్యాన్నికూడా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల డిమాండ్ మేరకు ఈ మేరకు ఎఫ్‌సీఐని కోరినట్లు మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు.