Revanth Reddy: ప్రగతి భవన్ పేరును 'ప్రజా భవన్'గా మారుస్తాం: రేవంత్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. గాంధీ భావన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ విజయం కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రగతి భవన్ పేరును మారుస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా భవన్‌గా మారుస్తామని వివరించారు. తనకు అండగా నిలిచిన రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హమీలను కాంగ్రెస్ నెరవేరుస్తుందని పేర్కొన్నారు.
ఈ విజయం అమరులకు అంకింతం: రేవంత్ రెడ్డి
డిసెంబర్ 3వ తేదీన శ్రీకాంత్‌చారి అమరుడయ్యారని, కాంగ్రెస్ విజయాన్ని శ్రీకాంత్‌చారికి, అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర ప్రజలు పూర్తి సహకారం అందించారన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా స్ఫూర్తిని నింపారన్నారు. తెలంగాణలో మానవ హక్కులను కాపాడటంలో తమ పార్టీ ముందుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ విజయంలో 30లక్షల మంది నిరుద్యోగుల పట్టుదల ఉందని రేవంత్ పేర్కొన్నారు. సీపీఐ, టీజేఎస్‌లతో కలిసి తాము రాష్ట్రంలో ముందుకెళ్తామని వెల్లడించారు. ఇక నుంచి 24గంటలు సచివాలయం గేట్లు సామాన్య ప్రజలకు ఎప్పుడూ తెరిచి ఉంటాయని రేవంత్ స్పష్టం చేశారు.