
Govt of India: : కాళేశ్వరం పూర్తి అయితే అప్పులపై వడ్డీ తగ్గింపును పరిశీలించొచ్చు: కేంద్రం
ఈ వార్తాకథనం ఏంటి
కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతే దానిపై తీసుకున్న అప్పులకు వడ్డీ తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించవచ్చని వెల్లడించింది. ప్రాజెక్టుకు సంబంధించిన రుణాల చెల్లింపులు లేదా వాటి పునఃషెడ్యూలింగ్ చేయడం జరిగితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం కాళేశ్వరం ఖాతాను 'స్టాండర్డ్' స్థాయి నుండి 'సబ్ స్టాండర్డ్' స్థాయికి పడతామని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వివరాలు
ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లు
తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను పునఃవ్యవస్థీకరించాలన్న వినతులు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థకు (Special Purpose Vehicle)పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (PFC),రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (REC)లాంటి సంస్థలు రుణాలు మంజూరు చేశాయని పేర్కొంది. ఈ సంస్థలు బ్యాంకేత్తర ఆర్థిక సంస్థలుగా (Non-Banking Financial Companies - NBFCs) వివిధ మార్గాల్లో నిధులను సేకరిస్తాయని, వాటి ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారని కేంద్ర ఆర్థికశాఖ వివరించింది. అలాగే, ప్రాజెక్టు పూర్తయ్యే గడువును రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఇప్పటికే డిసెంబర్ 2024 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తైన తర్వాత వడ్డీ రేట్ల తగ్గింపు అంశాన్ని సమీక్షించేందుకు అవకాశం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.