
CM Revanth Reddy: 'నూటికి నూరు శాతం చేస్తాం'.. బాధితులకు రేవంత్ హామీ
ఈ వార్తాకథనం ఏంటి
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సీఎం, దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమగ్ర కార్యాచరణను రూపొందించి, శాశ్వత పరిష్కారానికి ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. తక్షణ సహాయంగా మృతుల కుటుంబాలకు రూ. 1 లక్ష, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టరును ఆదేశించారు.
Details
skg
గాయాల తీవ్రతను బట్టి అవసరమైతే వారికి రూ. 10 లక్షల వరకు పరిహారం, కొన్ని నెలలపాటు పనిచేయలేని పరిస్థితిలో ఉన్నవారికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితులను సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారి వైద్యంలో అవసరమైన ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వం భరించనున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 100 శాతం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మృతుల పిల్లల చదువుల బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని వెల్లడించారు. ఇది ఒక తీవ్ర విషాదకర ఘటన. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
Details
ఈ ఘటనకు యాజమాన్యం బాధ్యత వహించాలి
రెస్క్యూ బృందాలు, మంత్రులు, అధికారులు, ఫైర్ సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీములు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 36 మంది మృతి చెందినట్లు కనుగొన్నారు. 143 మంది కార్మికులలో 58 మంది ఇప్పటికే సంప్రదింపులోకి వచ్చారు. మిగిలిన వారి ఆచూకీ కోసం క్షుణ్ణంగా గాలింపు జరుగుతోంది. బిహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన కార్మికులూ ఉన్నట్టు గుర్తించామని అని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు కారణమైన సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఫ్యాక్టరీల్లో తనిఖీలు నిర్వహించాలని, తప్పులు ఉంటే వెంటనే సరిదిద్దుకోవాలని అధికారులను ఆదేశించారు.