CM Chandrababu: వరద నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతాం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద వల్ల కలిగిన నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను ఈ రోజు సాయంత్రానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు నది గండిని పూడ్చివేయడంలో సైన్యం సహాయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇళ్లు శుభ్రం చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి అగ్నిమాపక యంత్రాలను తెప్పిస్తున్నామని, అలాగే, ఆన్‌లైన్ ద్వారా ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్‌ల సేవలను నియమిత ధరలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వివరించారు. నేటి నుండి నిత్యావసర సరుకులతో పాటు, ప్రతి కుటుంబానికి మూడు ప్యాకెట్ల నూడుల్స్, యాపిల్స్, పాలు పంపిణీ చేయబడుతున్నాయని పేర్కొన్నారు. అలాగే, వరద ప్రభావిత ప్రాంతాల్లో సెప్టెంబరు నెల విద్యుత్తు బిల్లుల వసూలును వాయిదా వేస్తున్నామని కూడా తెలిపారు.
80,000 మందికి నిత్యావసరాల కిట్
ముంపు ప్రభావిత ప్రాంతాల్లో వివిధ సేవలకు ఒకే ధరను నిర్ణయించి, ఇష్టానుసార వసూలు చేయకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. మూడు రోజుల్లో అన్ని కుటుంబాలకు నిత్యావసరాల సరఫరా పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ రోజు 80,000 మందికి నిత్యావసరాల కిట్‌ను అందించడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. రాయితీపై కూరగాయలు పంపిణీ కొనసాగుతుందని కూడా వివరించారు. ఇక, బుడమేరు నది పూడ్చివేతలో ఇప్పటివరకు రెండు గండ్లు పూడ్చామని, మూడో గండిని పూడ్చే పనులు కొనసాగుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు.