Andhra Pradesh: బలహీనమైన వాయుగుండం.. తీర ప్రాంతాలకు ఉపశమనం
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలుల వల్ల ఈ పరిణామం చోటు చేసుకుందని తెలిపింది. ఈ మార్పుతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. సముద్రం అలజడిగా ఉండటంతో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
మత్య్సకారులు వేటకు వెళ్లద్దు
వాయుగుండం ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. శనివారం శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలకు 4 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గాయి. మంగళవారం నుంచి బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ప్రజలను వాతావరణ శాఖ సూచించింది.