
తెలంగాణలో 5 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రానున్న ఐదు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశాలున్నట్లు తెలిపింది.
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదివారం, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగాం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఈ క్రమంలోనే ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నట్లు ఐఎండీ సూచించింది. సోమవారం నుంచి బుధవారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
details
హైదరాబాద్‌లో కుండపోత వర్షం
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ మహానగరం తడిసి ముద్ద అయ్యింది. సిటీలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మలక్‌పేట, ముసారాంబాగ్, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాన పడింది.
ఈ క్రమంలోనే చాదర్‌ఘాట్ నుంచి ఎల్బీనగర్ వైపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహానగర రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.
అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. ఇబ్బందులు తలెత్తితే 040-21111111, 90000113667 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. అత్యవసర బృందాలు, ఈవీడీఎం బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆమె ఆదేశించారు.