స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు
ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది. జయదేవ్, సాథీ దంపతులకు పాపులారిటీ పెంచుకుని, సెలబ్రిటీ కావాలన్న కోరిక బలంగా కలిగింది. దీంతో సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే సాధారణ స్మార్ట్ ఫోన్ కాకుండా మరింత నాణ్యతగా, కోరుకున్న రీతిలో వీడియోలు రికార్డు చేసేందుకు ఐఫోన్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు వారికి ఆర్థిక స్తోమత అడ్డొచ్చింది. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నబిడ్డను అమ్మేయాలని భార్యాభర్తలిద్దరూ తీర్మానించుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లా పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సాథీ దంపతులకు 7 ఏళ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు ఉన్నారు.
భార్యభర్తల జవాబుతో కంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు
ఇటీవలే ఈ భార్యభర్తలు పలు ప్రాంతాలను సందర్శిస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సరికొత్త ఆధునిక ఫోన్ కోసం ఏడాది కూడా నిండని కుమారుడ్ని విక్రయించేశారు. మరోవైపు తల్లిదండ్రుల పక్కనే ఉండాల్సిన పసికందు జాడ కనిపించలేదు. దీంతో బిడ్డపై స్థానికులు ఆరా తీశారు. డబ్బుల కోసం బిడ్డను తామే అమ్మేశామని బదులిచ్చారు. సదరు డబ్బుతో ఐఫోన్ కొనుగోలు చేసి ఇన్‌స్టా రీల్స్ చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో కంగుతిన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.