డబ్ల్యూఎఫ్‌ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు. దాదాపు ఏడు గంటలపాటు ఈ చర్చలు జరిగాయి. అనంతరం అనురాగ్ ఠాకూర్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బ్రిజ్ భూషణ్ శరణ్ పై రెజ్లర్లు తీవ్రమైన ఆరోపణలు చేసినట్లు ఆయన చెప్పారు. బ్రిజ్ భూషణ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష పదవి నుంచి అతను తప్పుకుంటానని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ విచారణ నాలుగు వారాల పాటు ఉంటుందని చెప్పారు.
నిజానిజాలను తేల్చేందుకు కమిటీ ఏర్పాటు: అనురాగ్ ఠాకూర్
డబ్ల్యూఎఫ్‌ఐ పాలక వర్గంపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను తేల్చేందుకు కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో 'పర్యవేక్షక కమిటీ'ని వేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. విచారణ అనంతరం తప్పకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కమిటీ నాలుగు వారాల్లో తమ నివేదికను అందజేస్తుందన్నారు. అప్పటి వరకు బ్రిజ్ భూషణ్ రోజువారీ బాధ్యతల నుంచి తప్పుకుంటారన్నారు. ఇదిలా ఉంటే, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐఓఏ ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పునియా మాట్లాడుతూ.. న్యాయమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.