Page Loader
Sangam Nose:'సంగం నోస్‌' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ?
'సంగం నోస్‌' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ?

Sangam Nose:'సంగం నోస్‌' ఏమిటీ ?.. అసలు ఈ ఘాట్‌ విశేషాలు ఏంటీ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 30, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంగం నోస్‌ ఘాట్ వద్ద మంగళవారం అర్ధరాత్రి తర్వాత తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘాట్‌ వద్దే జనం ఎందుకు ఎక్కువగా గుమిగూడారు?అసలు ఈ ఘాట్‌ ప్రత్యేకత ఏమిటి? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ప్రదేశాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు. ఉత్తర దిశ నుంచి ప్రవహించే గంగా,దక్షిణ దిశ నుంచి వచ్చే యమునా ఒక వంపు వద్ద కలుస్తాయి. ఆకాశం నుండి చూస్తే,ఈ ప్రాంతం మానవ ముక్కు ఆకారంలో ఉండటంతో,భక్తులు దీన్ని'సంగం నోస్‌'అని కూడా అంటారు. అంతర్వాహినిగా సరస్వతి నది సంగమించే ప్రదేశంగా భావించబడే ఈ ప్రాంతంలో, రెండు ప్రధాన నదుల ఒడ్డున కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తారు.

వివరాలు 

సాధువుల పవిత్ర స్నానాలు 

అయితే, సాధారణంగా నదీతీరంలో స్నానం చేయడం కంటే, మూడు నదుల సంగమస్థలంలో పుణ్యస్నానం చేయడం మోక్ష ప్రాప్తికి దోహదం చేస్తుందని విశ్వాసం ఉంది. చాలా మంది భక్తులు ఈ నమ్మకాన్ని పాటిస్తారు. సాధారణ భక్తుల సంగతి పక్కన పెడితే, నాగ సాధువులు, అఖాడా సభ్యులు, ఇతర ప్రముఖ పండితులు ప్రధానంగా సంగం నోస్ వద్దే పవిత్ర స్నానాలు నిర్వహిస్తారు. గతంలో జనాభా తక్కువగా ఉండటం వల్ల, మహాకుంభమేళాకు వచ్చే భక్తులందరూ ఈ త్రివేణి సంగమంలోనే స్నానం చేసేవారని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న భక్తులందరూ, ఇప్పటికీ ఇదే ప్రాంతంలో పవిత్ర స్నానం చేయాలని ఆసక్తి చూపుతున్నారు.

వివరాలు 

సరస్వతి నది కూడా ఈ సంగమంలో కలుస్తుంది 

సంగం నోస్ వద్ద, గంగా, యమునా నదుల ప్రవాహాలు స్పష్టంగా వేరుగా కనిపిస్తాయి. యమునా నదీ జలాలు లేత నీలం రంగులో ఉంటే, గంగా నది కొద్దిగా మట్టి కలిసిన రంగులో ఉంటుంది. యమునా నది ఇక్కడే గంగా నదిలో విలీనం అవుతుంది. అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ఈ సంగమంలో కలుస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకే, ఈ ప్రదేశాన్ని కుంభమేళాలో ప్రధాన ఘాట్‌గా పరిగణిస్తారు. వివిధ సంప్రదాయాలకు చెందిన అఖాడా సాధువులు తమ ఆచారాలను, అమృత స్నానాలను ఇక్కడే నిర్వహించడం సంప్రదాయంగా మారింది.

వివరాలు 

సంగం నోస్ విస్తరణ చర్యలు 

సంగం నోస్ ప్రాంతం ముక్కు ఆకారంలో కొద్దిగా ముందుకు సాగినట్టు ఉంటుంది. ఇది సహజంగా చిన్న ప్రదేశమై ఉండటంతో, పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించడానికి వీలుపడదు అయితే, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దీనిని విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇసుక బస్తాలను ఏర్పాటు చేసి, డ్రెడ్జింగ్ నిర్వహించి, ఒడ్డును మరింత విస్తరించారు. ఈ విస్తరణలో భాగంగా, శాస్త్రి వంతెన సమీపంలో 26 హెక్టార్ల అదనపు భూభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. అదనంగా,సుమారు 1.5కిలోమీటర్ల మేర ఇసుక బస్తాలతో ఘాట్‌ను విస్తరించారు. 2019 కుంభమేళాలో, గంటకు 50,000 మంది ఈ ఘాట్‌లో స్నానం చేశారు. విస్తరణ తర్వాత,2025 కుంభమేళాలో గంటకు 2,00,000మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేయగలరని అధికారులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

అమృత స్నానం రోజుల్లో నిబంధనలు 

జనవరి 13, 14 తేదీల్లో, గంటకు 3,00,000 మంది భక్తులు ఇక్కడ స్నానం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. సాధువుల ప్రత్యేక అమృత స్నానం రోజుల్లో, సాధారణ భక్తులను సంగం నోస్ ఘాట్ వద్ద ప్రవేశించనివ్వరు. అయితే, మిగతా రోజుల్లో భక్తులు పడవల ద్వారా ఘాట్‌కు చేరుకొని పుణ్యస్నానం చేస్తారు. కానీ అమృత స్నానం సమయంలో పడవలకు కూడా అనుమతి ఉండదు. సంగం నోస్ ఘాట్ 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న మహాకుంభమేళా ఘాట్‌లలో ఒకటి. భక్తుల నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రాంతాన్ని మరింత విస్తరించి, వారికి సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.