
Simla Agreement: పాకిస్తాన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ చర్యలపై పాకిస్తాన్ కూడా తీవ్రంగా స్పందిస్తూ ప్రతీకార చర్యలకు దిగింది.
ఈ క్రమంలో, భారత పౌరులు పాకిస్తాన్ ను తక్షణమే వదిలివెళ్లాలని ఆదేశించింది.
భారతీయ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా, తమ గగనతలాన్ని మూసివేసింది.
అంతేగాక, అట్టారి-వాఘా సరిహద్దు మార్గాన్ని కూడా మూసివేయడం ద్వారా రెండు దేశాల మధ్య ప్రత్యక్ష రాకపోకలకు అడ్డుకట్ట వేసింది.
వివరాలు
"సింధు నదీ జలాల ఒప్పందం"రద్దు
అలాగే, భారతీయులకు జారీ చేసే సార్క్ వీసాలను పాకిస్తాన్ రద్దు చేసింది. ఇకపై భారత్‌తో వాణిజ్య సంబంధాలు, దౌత్య సంబంధాలను పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు స్పష్టం చేసింది.
భారత్ "సింధు నదీ జలాల ఒప్పందం"ను రద్దు చేసిన నేపథ్యంలో, ప్రతిగా పాకిస్తాన్ "సిమ్లా ఒప్పందం"ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
50 సంవత్సరాలుగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న ఆ ఒప్పందాన్ని రద్దు చేయడం భారత్ దృష్టిలో తీవ్రమైన చర్యగా మారింది.
దీని ద్వారా ప్రత్యక్ష యుద్ధానికి దారి తీయాలనే సంకేతమని భారత ప్రభుత్వం అభిప్రాయపడింది.
వివరాలు
సిమ్లా ఒప్పందం అంటే ఏమిటి?
1971లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం అనంతరం, 1972లో ఇరు దేశాల మధ్య శాంతికి నిదర్శనంగా "సిమ్లా ఒప్పందం" కుదిరింది.
అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ, పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం, 1971 డిసెంబర్ 17 నాటి కాల్పుల విరమణ రేఖను అధికారికంగా నియంత్రణ రేఖ (LOC)గా మార్చారు.
అంతేకాకుండా, యుద్ధ ఖైదీలను పరస్పరం విడుదల చేయడం, సరిహద్దుల్లో ఉన్న సైనిక దళాలను వెనక్కి తీసుకోవడం, భవిష్యత్తులో తలెత్తే వివాదాలను మూడో దేశం జోక్యం లేకుండా ఇద్దరు దేశాలు ప్రత్యక్షంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నదే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం.
వివరాలు
భారత్, పాకిస్తాన్‌లు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి
కాష్మీర్ సమస్యను సహా అన్ని అంశాలను భారత్, పాకిస్తాన్‌లు పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఇందులో స్పష్టంగా పేర్కొనబడింది.
ఈ ఒప్పందం ఆధారంగా గతంలో ఐక్యరాజ్య సమితి కూడా కాశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోకపోవడానికి కారణమైంది.
ప్రస్తుతం ఏర్పడిన ఉద్రిక్తతల దృష్ట్యా, పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని ఇకపై అమలు చేయబోమని ప్రకటించటం ద్వారా, మూడో దేశాలకు.. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలకు - భారత్-పాక్ సమస్యలపై జోక్యం చేసే మార్గం తెరవబోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.