
#NewsBytesExplainer: తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. వ్యూహాల్లో ప్రధాన పార్టీలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతాన్ని బీసీలు కలిగి ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు వారిని ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. బీసీలను తమవైపు తిప్పుకుంటే ఎన్నికల ఫలితాల్లో పైచేయి సాధించవచ్చని భావిస్తున్నాయి. పైకి పార్టీలు రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతున్నా, వాస్తవానికి రాజకీయ లాభాల కోసమే ఆత్మీయత చూపిస్తున్నాయని వాదనలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో 'హీరోలు'గా నిలవాలనే కాంక్షతో అన్ని పార్టీలూ పోటీ పడుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, బీసీ సంఘాలు మాత్రం ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా కాకుండా, సమస్య పరిష్కార దిశగా పార్టీలు నడవాలని కోరుతున్నాయి.
వివరాలు
బీసీలపై నినాదంతో ముందుకు వచ్చిన కాంగ్రెస్
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. ఇందులో కులగణన,బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు వంటి హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం కులగణన పూర్తి చేసింది. లెక్కలు అసెంబ్లీలో సమర్పించిన తర్వాత,వాటికి అనుగుణంగా విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రెండు వేర్వేరు బిల్లులు ఆమోదించాయి. ప్రస్తుతం ఈ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.వాటికి సమయం పట్టే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని, స్థానిక సంస్థల ఎన్నికల కోసం 42 శాతం రిజర్వేషన్లను కల్పించే విధంగా ఓ ఆర్డినెన్స్‌కు ముసాయిదా తయారు చేశారు. దీనిపై గవర్నర్ నుంచి లీగల్ ఓపీనియన్ తీసుకుని కేంద్ర హోంశాఖకు పంపించారు.
వివరాలు
కుల గణనకు కేంద్రం అంగీకారం
ఇదే సమయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ క్రమంలో ఢిల్లీలోని పార్టీ ఎంపీలకు, నాయకులకు బీసీ కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇది తెలుసుకున్న బీజేపీ కూడా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా కుల గణన పట్ల ఆసక్తి చూపిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం ఈ వ్యవహారాన్ని తన విజయంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు సంబంధించి బిల్లులు ఆమోదించడంతో, వీటిని కేంద్రం ఆమోదించాలన్న డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆగస్టు తొలి వారంలో రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించింది. ఒకవేళ అపాయింట్‌మెంట్ రాకపోతే ఢిల్లీలోనే నిరసన కార్యక్రమం చేపట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు.
వివరాలు
మైలేజ్ ఎవరికన్నదే పాయింట్!
బీసీల పట్ల అన్ని పార్టీలు ప్రేమను చూపుతున్నట్లే ఉన్నాయి. కానీ నిజంగా రిజర్వేషన్ల అమలు ద్వారా మైలేజ్ ఎవరికీ దక్కుతుందన్నదే అసలు విషయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే బిల్లులు ఆమోదించిందని చెప్పి తమకే క్రెడిట్ దక్కించుకోవాలని చూస్తోంది. బిల్లులు ఆమోదం పొందకపోయినా, కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని దోషిగా నిలబెట్టి, దాంతో కూడ రాజకీయ లాభం పొందాలన్న వ్యూహాన్ని కాంగ్రెస్ అమలుచేస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
వివరాలు
బీజేపీ అభ్యంతరాలు
బీసీ రిజర్వేషన్ల అంశంలో బీజేపీ స్పష్టంగా తన వ్యతిరేకతను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కులగణన ప్రకారం బీసీ జనాభా 56.33 శాతంగా ఉందని చెబుతుంది. కానీ ఇందులో ముస్లింలు 10 శాతంగా ఉన్నారని బీజేపీ పేర్కొంటోంది. ఈ ముస్లిం జనాభాను తీసేస్తే బీసీ శాతం 46కి తగ్గుతుందని, ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారని ప్రశ్నిస్తోంది. ముస్లింలను వేరుగా ఉంచి మాత్రమే రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకురావాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని బీసీ రిజర్వేషన్ బిల్లులు కేంద్రం నుంచి ఆమోదం పొందే అవకాశాలు తగ్గే అవకాశం ఉందని సంకేతాలు ఇస్తోంది. ముస్లింలను కలిపి 42 శాతం రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వబోమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
వివరాలు
హిందూ ఓట్లను సమీకరించేందుకు బలమైన వ్యూహాలు
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం,ఇదే తరహా రాజకీయాన్ని బీజేపీ 1990లో మండల్ కమిషన్ సమయంలో కూడా అనుసరించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్‌కు అనుకూలంగా మాటలు చెప్పినప్పటికీ, హిందూ ఓట్లను సమీకరించేందుకు బలమైన వ్యూహాలను వాడింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం,అద్వానీ రథయాత్ర వంటి కార్యక్రమాలన్నీ బీజేపీ హిందూ ఓట్లను సమీకరించేందుకు రూపొందించిన వ్యూహంలో భాగంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు కూడా బీజేపీ బీసీలకు మద్దతునిచ్చే మాటలు చెబుతోంది. కానీ ముస్లింల అంశాన్ని తెరమీదకు తీసుకురావడం వెనుక రాజకీయ లెక్కలున్నాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్రం అంగీకారం తెలుపితే, ఆ క్రెడిట్ కాంగ్రెస్‌కే దక్కుతుందని భావిస్తున్నందున, బీజేపీ దీనిపై పలు షరతులు పెడుతోందని విశ్లేషకుల అభిప్రాయం.
వివరాలు
బీఆర్ఎస్ ఏమంటోంది?
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది. అయితే కాంగ్రెస్ చర్యలపై ఆ పార్టీకి అనుమానాలున్నాయి. రిజర్వేషన్ల అమలుకు తలెత్తే న్యాయపరమైన, సాంకేతిక సమస్యలు తెలిసినా, కాంగ్రెస్ ముందడుగు వేసిందని, తరువాత ఆ అమలు జరగకపోతే ఇతర పార్టీలపై నెపం వేసేందుకు ప్లాన్ చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో ఉన్న తరుణంలో ఈ బిల్లుల ఆమోదం పూర్తిగా రాజకీయ అంగీకారంపై ఆధారపడి ఉంటుంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కనుక ఆమోదం రాకపోతే బాధ్యత కాంగ్రెస్‌దేనని తేల్చేస్తున్నారు.
వివరాలు
బీఆర్ఎస్ కంటే ముందే కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలఅంశంలో బీఆర్ఎస్ కంటే ముందుగానే ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అసెంబ్లీలో జ్యోతిరావ్ ఫూలే విగ్రహం ఏర్పాటు,బీసీ సమస్యలపై చేసిన పోరాటం ఇందుకు ఉదాహరణ. బీసీరిజర్వేషన్ల ఆర్డినెన్స్‌కు మద్దతు ఇవ్వడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు.అయితే,బీఆర్ఎస్ మాత్రం ఇంకా సాంకేతిక అంశాలు ఉన్నాయని మెలికలుపెడుతోంది. బీఆర్ఎస్ తన మార్గంలోకి రావాల్సిందే అని కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు..రాజకీయ చర్చకు దారితీశాయి. అగస్టు 5,6,7 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలు,బీసీ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలవనున్నారు. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ కూడా విడిగా రాష్ట్రపతిని కలవాలని యోచిస్తోంది. అదే సమయంలో కరీంనగర్‌లో బీసీ సభను,అలాగే అన్ని జిల్లాల్లో బీసీ సభలను నిర్వహించాలన్న తీర్మానం బీఆర్ఎస్ తీసుకుంది.