whatsApp: కేరళలో ప్రత్యేక వర్గం పేరుతో ఐఏఎస్ అధికారుల వాట్సప్ గ్రూపు ఏర్పాటుపై వివాదం..
కేరళలో ఐఏఎస్ అధికారుల ఒక ప్రత్యేక వర్గం పేరుతో ఏర్పాటుచేసిన వాట్సప్ గ్రూప్ వివాదానికి దారి తీసింది. ఈ వాట్సప్ గ్రూప్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ పరిణామంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ, వర్గాల ఆధారంగా గ్రూపులు ఏర్పాటు చేయడం సరికాదని కేరళ మంత్రి పి. రాజీవ్ వ్యాఖ్యానించారు.
ఆ గ్రూప్ అడ్మిన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి
మంత్రి పి. రాజీవ్ మాట్లాడుతూ, "ఈ అంశంపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రవర్తనా నియమావళి ప్రకారం విచారణ కొనసాగుతుంది" అని పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, ఆ గ్రూప్ అడ్మిన్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. గోపాలకృష్ణన్ ఉన్నట్లు సమాచారం. ఈ గ్రూప్‌లో సీనియర్, జూనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారని కూడా వెల్లడించారు. విమర్శలు ఎక్కువ కావడంతో వెంటనే ఆ గ్రూప్‌ను డిలీట్ చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కె. గోపాలకృష్ణన్ తన వాట్సప్ ఖాతా హ్యాక్ అయినట్లు సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా ఆ గ్రూప్ క్రియేట్ చేయబడిందని, ఈ విషయాన్ని గ్రూప్ సభ్యులకు సందేశం పంపినట్లు కూడా తెలిపారు.