తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోవడం వల్ల ఏ పార్టీ లాభం?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. తాను ఎన్నికలపై దృష్టి పెట్టే పరిస్థితిలో లేనని, అందుకే పోటీకి దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌కు అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారు.
తెలంగాణలో టీడీపీ సొంత ఓటు బ్యాంకు ఉన్నది. అయితే ఇప్పుడు ఆ ఓటు బ్యాంకు ఎటు వైపు వెళ్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తును రెండు రాష్ట్రాల్లోని టీడీపీ అభిమానులు, జీర్ణించుకోలేకపోయారు.
కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ పొత్తును అంగీకరించలేదు. దీంతో ఆ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఒక్క ఖమ్మం జిల్లాలో తెలంగాణలో తప్ప, ఎక్కడా కూడా ఓట్లు బదలీ కాలేదు.
చంద్రబాబు
కీలకంగా మారిన చంద్రబాబు అరెస్టు అంశం
2018లో ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్ పొత్తును ఇరు పార్టీల శ్రేణులు ఒప్పుకోలేదు. దీంతో 60శాతం టీడీపీ ఓటర్లు, 90శాతం ఆంధ్రా సెటిలర్లు అప్పటి టీఆర్ఎస్‌కు ఓటు వేశారు. దీంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీగా విజయాన్ని అందుకుంది.
ఇప్పుడు టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఉంది. అంతేకాకుండా చంద్రబాబు జైలులో ఉన్నారు. ఫలితంగా చంద్రబాబు పట్ల సానుభూతి కూడా పెరిగింది.
చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ అగ్రనేతలు గట్టిగా ఖండిచలేదు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు చంద్రబాబు అరెస్టు విషయం ఏపీకి మాత్రమే చెందిన అంశంగా మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామంతో గతంలో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలిచిన ఆంధ్రా సెటిలర్లు, టీడీపీ ఓటర్లు ఈసారి దూరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చంద్రబాబు
కాంగ్రెస్‌కే ప్లస్ అవుతుందా?
చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ తగిన రీతిలో స్పందించకపోవడం వల్ల.. టీడీపీ మద్దతుదారులు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా చంద్రబాబు అరెస్టును కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.
ఈ పరిణామం టీడీపీ ఓటర్లు.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, కాంగ్రెస్‌లో ఇప్పుడు కీలక నేతలుగా ఉన్న రేవంత్ రెడ్డి, సీతక్కు, రేవూరి ప్రకాశ్ రెడ్డి లాంటి నేతలు ఒకప్పుడు చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండేవారు.
ఈ సెంటిమెంట్ కూడా కాంగ్రెస్‌కు టీడీపీ ఓట్లర్లు, ఆంధ్రా సెటిలర్లు మద్దతు ఇవ్వొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.