'Whistleblower':'రూ.53 కోట్లు ఇస్తే ఈవీఎంహ్యాక్ చేస్తా'.. మహారాష్ట్ర ఎన్నికల వేళ కలకలం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమికి లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ఒక హ్యాకర్ జాతీయ మీడియా రహస్య ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయాన్ని ఏకంగా కూటమికి చెందిన ఒక ఎంపీతో చర్చలు జరిపినట్లు చెప్పారు. సదరు మీడియా ప్రతినిధి.. ఈవీఎంలు హ్యాక్ అయ్యాయని పలు సార్లు ఆరోపించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. కాల్‌లో మీడియా ప్రతినిధి తనను ఒక ఎంపీకి పీఏగా పరిచయం చేసుకున్నారు. అనంతరం,"మీతో ఒక ప్రముఖ వ్యక్తి మాట్లాడాలని ఆశిస్తున్నారు, మీరు మాట్లాడగలరా?" అని అడిగారు. దీనికి సయ్యద్ స్పందిస్తూ, ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని చెప్పారు.
స్కానింగ్, యాప్స్ ఉపయోగించడం ద్వారా సిగ్నల్స్ మార్పు
తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తనకు అనుకూలంగా ఉండే విధంగా ఈవీఎం హ్యాక్ చేయాలని అభ్యర్థించారు. సయ్యద్ దీనిపై స్పందిస్తూ నియోజకవర్గ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈవీఎం హ్యాక్ చేసేందుకు భారీ మొత్తం డబ్బు అవసరమని, దాదాపు రూ. 52-53 కోట్లను చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈవీఎంలను హ్యాక్ చేసే విధానంలో స్కానింగ్, యాప్స్ ఉపయోగించడం ద్వారా సిగ్నల్స్ మార్చగలనని అన్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీకి అనుకూలంగా ఈవీఎంలను హ్యాక్ చేసినట్లు సయ్యద్ షుజా చెప్పడం సంచలనంగా మారింది. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై మహారాష్ట్రలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.