Bhole Baba: హత్రాస్ తొక్కిసలాటలో 116 మందికి పైగా మృతి.. ఘటన తర్వాత భోలే బాబా పరార్..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఒక మతపరమైన సమావేశంలో తొక్కిసలాటలో 116 మందికి పైగా మరణించగా అనేక మంది గాయపడ్డారు. సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా నిర్వహించిన సత్సంగం ముగింపు కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది. తొక్కిసలాట ఘటన తర్వాత ఆచూకీ లభించని భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. తొక్కిసలాట గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ మృతదేహాలను చూసిన రజనీష్ అనే పోలీసు అధికారి గుండె పోటుతో మరణించారు. రజనీష్ అత్యవసర సహాయక బృందంలో కీలక సభ్యుడు . కాగా ఈ రోజు ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ ఘటనా స్ధలికి వెళ్లి బాధుతులను ఓదార్చనున్నారు.
భోలే బాబా ఎవరు ?
భోలే బాబా ఎటా జిల్లాలోని పాటియాలీ తహసీల్‌లోని బహదూర్ గ్రామానికి చెందినవాడు. అతను ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) మాజీ ఉద్యోగి అని చెప్పుకున్నాడు. మతపరమైన ప్రసంగాలు చేయడం కోసం 26 ఏళ్ల క్రితం తన ప్రభుత్వ ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. ప్రస్తుతం పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్ ఢిల్లీతో సహా భారతదేశం అంతటా సత్సంగం నిర్వహిస్తుంటాడు. కాగా ఆయనకు లక్షలాదిగా అనుచరులు ఉన్నారు.
సోషల్ మీడియాకు భోలే బాబా దూరం
ముఖ్యంగా, కొందరు హిందూ మత ప్రవక్తల వ్యక్తుల మాదిరిగా కాకుండా, భోలే బాబా సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఏ ప్లాట్‌ఫారమ్‌లోనూ అధికారిక ఖాతాలను కలిగి లేరు. అట్టడుగు స్థాయిలో ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని ఆయన అనుచరులు చెప్పుకుంటారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో ప్రతి మంగళవారం భోలే బాబా కార్యక్రమాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ కార్యక్రమాలకు వేలాది మంది హాజరవుతారు. ఈ సమావేశాల సమయంలో, వాలంటీర్లు భక్తులకు ఆహారం , పానీయాలతో సహా అవసరమైన ఏర్పాట్లను చేస్తారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్ద సంఖ్యలోబోలే బాబా జనాలను ఆకర్షించారు.