బిహార్ డాన్ ఆనంద్ మోహన్ ఎవరు? ఆయన విడుదల కోసమే జైలు నిబంధనల మార్చారా?
గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ బిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆనంద్ మోహన్ విడుదల వార్త ఇప్పుడు బిహార్‌లో సంచలనంగా మారింది. బిహార్ ప్రభుత్వం ఇటీవల సవరించిన జైలు నిబంధనల కారణంగా ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం కావడం గమనార్హం. నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ఆయన విడుదలను సులభతరం చేసేందుకే జైలు నిబంధనలను సవరించిందంటూ ప్రతిపక్షాలు భగ్గమంటున్నాయి. ఆనంద్ మోహన్ తన కుమారుడి నిశ్చితార్థం కోసం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. 1994లో 30ఏళ్ల నాటి ఐఏఎస్ గోపాల్‌గంజ్ జిల్లా మేజిస్ట్రేట్ జి.కృష్ణయ్య హత్య కేసులో ఆనంద్ మోహన్ దోషిగా తేలారు. ఈ కేసులో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
నితీష్ కుమార్ ప్రభుత్వం సవరించిన నింబధన ఏంటి?
నితీష్ కుమార్ ప్రభుత్వం ఏప్రిల్ 10న ప్రిజన్ మాన్యువల్, 2012ను సవరించింది. ముఖ్యంగా 481నిబంధనను మార్చడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ప్రభుత్వ అధికారులను చంపినందుకు దోషులుగా ఉన్నవారు సత్ప్రవర్తన కారణంగా విడుదల చేయడానికి అర్హులు కాదని 481 నిబంధనల చెబుతుంది. అయితే ఈ క్లాజ్‌ను ప్రభుత్వం తొలగించింది. దీని ద్వారా శిక్ష కాలం తగ్గుతుంది. ఈ నిబంధనను సవరించడం వల్లే ప్రభుత్వ ఐఏఎస్ హత్య కేసులో దోషిగా తేలిన డాన్ ఆనంద్ మోహన్‌తో మరికొందరు సత్ప్రవర్తన కింద విడుదలయ్యారు. ప్రతిపక్షాల విమర్శలపై ఆనంద్ మోహన్ స్పందించారు. సుదీర్ఘ జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయవచ్చని ఆనంద్ మంగళవారం అన్నారు.
నితీశ్ చెప్పిన మూడు నెలల్లోనే ఆనంద్ మోహన్
ఈ ఏడాది జనవరిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పార్టీ జేడీయూ ఆధ్వర్యంలో పట్నాలో రాజ్‌పుత్ సదస్సును నిర్వహించారు. అయితే ఈ సదస్సులో గ్యాంగ్‌స్టర్ 'ఆనంద్ మోహన్ విడుదల' నినాదాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడుతూ, ఆనంద్ మోహన్ గురించి చింతించవద్దని, తన వంతు ప్రయత్నం చేస్తానని నితీశ్ చెప్పడం సంచలనంగా మారింది. నితీశ్ అన్న విధంగా మూడు నెలల్లో ఆనంద్ మోహన్ జైలు నుంచి శాశ్వతంగా బయటపడ్డారు.
స్వాతంత్య్ర భారతంలో మరణశిక్ష పడిన తొలి రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్
1994లో ఆనంద్ మోహన్ నేతృత్వంలోని గ్యాంగ్ దళిత ఐఏఎస్, గోపాల్‌గంజ్ కలెక్టర్ కృష్ణయ్యను హత్య చేసారు. ఆంధ్రప్రదేశ్‌లోని దళిత కుటుంబంలో జన్మించి కలెక్టర్ స్థాయికి ఎదిగిన అమాయక ప్రభుత్వోద్యోగిని నాడు రౌడీ ముకలు కొట్టి చంపాయి. ప్రస్తుతం ఆనంద్ ఈ కేసులో శిక్ష అనభవిస్తూనే జైలు నుంచి విడుదలయ్యయారు. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న బిహార్ డాన్ ఆనంద్ మోహన్ 1996లో జైలులో నుంచే ఎన్నికల్లో పోటీచేసి సియోహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన ఆనంద్‌కు 2007లో పాట్నా హైకోర్టు మరణశిక్ష విధించింది. 2008లో శిక్షను జీవిత ఖైదుగా తగ్గించారు. స్వాతంత్య్ర భారతంలో మరణశిక్షను పడిన తొలి భారత రాజకీయ నాయకుడు ఆనంద్ మోహన్
కుల సమీకరణాల్లో భాగంగానే ఆనంద్ మోహన్‌ను విడుదల చేశారా?
వాస్తవానికి మార్చి 2021లో బిహార్ ప్రభుత్వం ఆనంద్ మోహన్ జైలు శిక్షను రద్దు చేసే డిమాండ్‌ను తిరస్కరించింది. ఎందుకంటే అప్పుడు నితీష్‌కి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు ఆనంద్ మోహన్ కుమారుడు, భార్య నితీష్ సంకీర్ణ భాగస్వామి అయిన ఆర్జేడీలో ఎమ్మెల్యేలుగానే కాకుండా కీలకమైన నేతలుగా ఉన్నారు. బిహార్‌లో వరుస ఎన్నికల నేపథ్యంలో నితీష్‌కు మద్దతు ఇచ్చే వర్గాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. బీజేపీ కలిసి ఉన్నప్పుడు నితీష్ హిందుత్వ ముసుగుతో నెట్టుకొచ్చారు. ఇప్పుడు బీజేపీకి దూరం కావడంతో మతపరమైన రాజకీయాలు చెల్లవు. అందుకే కుల సమీకరణాలపై ఇప్పుడు నితీష్ దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. కుల సమీకరణాల్లో భాగంగానే ఆనంద్ మోహన్‌ను నితీష్ ప్రభుత్వం విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది.