Saif Ali Khan: సైఫ్ ఇంటిని పరిశీలించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్.. ఇంతకీ ఎవరీ దయానాయక్..
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు సైఫ్ అలీఖాన్ దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
మరోవైపు, పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ సందర్భంగా, పోలీసు అధికారుల బృందం సైఫ్ ఇంటిని సందర్శించగా, అందులో దయా నాయక్ కూడా ఉన్నారు.
బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి దయా నాయక్ వివరాలను సేకరించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
దయా నాయక్, ముంబయి అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా ప్రసిద్ధి పొందారు.
వివరాలు
ఇంతకీ ఎవరీ దయానాయక్..
దయా నాయక్ జీవితం ఎంతో ఆసక్తికరమైనది. కర్ణాటకలోని ఉడిపిలో కొంకణ్ మాట్లాడే కుటుంబంలో జన్మించిన ఆయన, స్థానికంగా ఏడో తరగతి వరకు చదువుకున్నారు.
1979లో కుటుంబం ఉపాధి నిమిత్తం ముంబయికి వెళ్లింది. అక్కడ ఒకవైపు హోటల్‌లో పనిచేస్తూనే, మరోవైపు మున్సిపల్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశారు.
అనంతరం అంధేరిలోని కాలేజ్‌లో సీఈఎస్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. పోలీసుగా సేవ చేయాలని చిన్నప్పటి నుంచే కలలు కనిన ఆయన, 1995లో స్టేట్ పోలీస్ పరీక్షలో విజయం సాధించి జుహు పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా చేరారు.
ఆయన చేరిన నాటి నుంచి ముంబయి అండర్‌వరల్డ్ గ్యాంగ్‌ల పై దాడులు జరిపారు.
వివరాలు
దయా నాయక్ జీవిత కథ ఆధారంగా పలు చిత్రాలు
1996లో చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేయడం ద్వారా దయా నాయక్ పేరు వెలుగులోకి వచ్చింది.
ఈ క్రమంలో దాదాపు 80 మంది నేరగాళ్లను ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.
ఎంత పేరు సంపాదించారో, అంతే వివాదాలను కూడా చవి చూశారు.
అధిక ఆస్తుల కేసులో ఏసీబీ దయా నాయక్‌ను విచారించి అరెస్ట్ చేసింది. తర్వాత, 2012లో అదనపు కమిషనర్‌గా తిరిగి విధుల్లో చేరారు.
ఇప్పుడు సైఫ్ దాడి కేసు విచారణలో భాగంగా దయా నాయక్ చురుకుగా వ్యవహరించడం ఆసక్తికర అంశంగా మారింది.
దయా నాయక్ జీవిత కథ ఆధారంగా హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలు నిర్మించబడ్డాయి.