
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాంలో రాజ్ కసిరెడ్డి తర్వాత ఎవరు?.. మరో హై-ప్రొఫైల్ పేరు బయటకు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో తాజాగా మరో సంచలన మలుపు చోటు చేసుకుంది.
ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు, విచారణను మరింత వేగవంతం చేశారు.
ఈ కేసులో మరో ప్రముఖుడి పేరు వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో వచ్చిన సమాచారం ప్రకారం, 'బియాండ్ కాఫీ' అధినేత బాలం సుధీర్ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
సుధీర్ పేరును రాజ్ కసిరెడ్డి సన్నిహితుడిగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. మరింతగా రాజ్ కసిరెడ్డి నుంచి బాలం సుధీర్‌కు రూ.50 కోట్లు చేరినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
ఈనేపథ్యంలో బాలం సుధీర్‌ను అరెస్ట్ చేసేందుకు సిట్ కార్యాచరణ ప్రారంభించినట్టు సమాచారం.
Details
అరెస్టు చేసి విజయవాడకు తరలింపు
రాజ్ కసిరెడ్డిని విచారిస్తున్న సమయంలోనే సుధీర్ పేరు బయటకు వచ్చినట్లు చెబుతున్నారు. సిట్ అధికారులు ప్రస్తుతం విచారణను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నారు.
నిన్న అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు రాజ్ కసిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్, ఈరోజు ఉదయం 7 గంటల నుంచీ మళ్లీ విచారణ కొనసాగిస్తున్నారు.
ఈకేసులో రాజ్ కసిరెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఆయనను అరెస్ట్ చేసినట్టు సమాచారం.
విచారణకు హాజరుకావాలని మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించని రాజ్ కసిరెడ్డి.. చివరకు రేపు విచారణకు వస్తానని చెప్పిన తర్వాత, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయనను అదుపులోకి తీసుకొని వెంటనే విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే.