
Telangana Bjp: తెలంగాణ బీజేపీకి చీఫ్ ఎవరు? కిషన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఆసక్తికరం!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలకు పోటీచేసి, అందులో రెండు సీట్లను గెలుచుకోవడం ద్వారా పార్టీ తన బలాన్ని మరింత పెంచుకుంది.
ఇదే ఉత్సాహంతో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి నియామకాన్ని పూర్తి చేసి, మరింత దూకుడుగా ముందుకెళ్లాలని కమలనాథులు వ్యూహరచన చేస్తున్నారు.
హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి
ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, కేంద్రమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త నాయకుడిని నియమించాలని పార్టీ భావిస్తోంది.
అయితే వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నా, కొత్త అధ్యక్షుడిని ప్రకటించే సమయం ఆసన్నమైందని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Details
పార్టీ బలోపేతం కోసం కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని నిర్ణయం
తాజాగా కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ అంశంపై పార్టీ పెద్దలతో చర్చించిన అనంతరం కొత్త రాష్ట్ర అధ్యక్షుడి పేరు ఖరారయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఇప్పటికే పలు దఫాలుగా నేతల అభిప్రాయాలు సేకరించిన పార్టీ అధిష్టానం, రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటోంది.
బీజేపీని మరింత బలోపేతం చేసేలా కొత్త నాయకుడిని ఎంపిక చేయాలని నిర్ణయించింది.
ప్రాంతీయ సామాజిక సమీకరణాలను సమతుల్యం చేయడంతో పాటు, పార్టీ నేతలందరినీ సమన్వయం చేసుకునే నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తోంది.
Details
బండి సంజయ్ క్లారిటీ - రేసులో ఎవరు?
రాష్ట్ర అధ్యక్షుడి పదవికి సంబంధించి బండి సంజయ్, రాజేందర్, డీకే అరుణ వంటి ప్రముఖ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి.
తాను ఈ పోటీలో లేనని సంజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. మరోవైపు ఈటల రాజేందర్ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయాన్ని పాటిస్తానని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, అలాగే మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు పేర్లు షార్ట్‌లిస్ట్ అయ్యాయి.
రాష్ట్ర అధ్యక్షుడి నియామక పరిశీలకురాలిగా ఉన్న శోభా కరంద్లాజే ఇప్పటికే రాష్ట్ర నేతల అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి రిపోర్ట్ సమర్పించినట్లు సమాచారం.
కొత్త అధ్యక్షుడి ఎంపికతో బీజేపీ దూకుడుగా ముందుకు సాగుతుందా? మరిన్ని మార్పులు చోటుచేసుకుంటాయా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.