Delhi:దిల్లీ పీఠం ఎవరిది? మొదలైన కౌంటింగ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో తేలనున్నాయి. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.
మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద 10 వేల మంది పోలీసులను మూడంచెల భద్రతతో మోహరించారు. లెక్కింపు ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.
దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీ 36 స్థానాలు కావాలి. ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Details
గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీ
తాజా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేయగా, ఆప్ ఈ అంచనాలను ఖండించింది.
తమ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ, మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ఆప్ నాయకత్వం ప్రకటించింది. 2013 నుంచి దిల్లీపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతోంది.
వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో కేజ్రీవాల్ పార్టీ ఉంది. మరోవైపు, 26 ఏళ్ల విరామం తర్వాత దిల్లీ పాలనను స్వాధీనం చేసుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది.
2013 వరకు దిల్లీలో వరుసగా 15 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఈసారి కూడా అంతగా ప్రభావం చూపే అవకాశాలు కనిపించడంలేదు.