Delhi Court: ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదు?..కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు భయపడుతున్నారు. దీంతో ఆయన దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఈడీ కఠిన చర్యలు తీసుకోవద్దని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఎక్సైజ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటివరకు 9 సమన్లు పంపింది. మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించేందుకు ఈడీ 9వ సమన్లు పంపింది. అంతకుముందు, ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ సమన్లన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేశారు.
కేజ్రీవాల్ కు రక్షణ కల్పించాలి: అభిషేక్ మను సింఘ్వీ
ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ హైకోర్టులో సవాల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్‌పై బుధవారం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ తరపు న్యాయవాదిని కేజ్రీవాల్ ఈడీ ఎదుట ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించింది. విచారణకు హాజరుకాకుండా వారిని ఎవరు ఆపుతున్నారు? దీనిపై కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ నేతను అరెస్టు చేయాలన్న ఈడీ ఉద్దేశం స్పష్టంగా ఉందన్నారు. నిర్బంధం వంటి ప్రతికూల చర్య తీసుకోకుండా కేజ్రీవాల్ కు రక్షణ కల్పించాలన్నారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ నిందితుడా, అనుమానితుడా, సాక్షా అన్నది తెలియజేయకుండానే హాజరుకావాలని ఈడీ సమన్లు జారీ చేస్తోందని చెప్పారు.
విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా
విచారణకు హాజరైతే ఆ విషయం తెలుస్తుందని ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేస్తారని భావిస్తుంటే చట్టపరమైన రక్షణ ఎందుకు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై ఈడీ వైఖరేమిటో రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసును తదుపరి విచారణ ఏప్రిల్ 22వ తేదీకి వాయిదా వేసింది.