Rahul Gandhi: దిల్లీని జైలుగా మార్చారు.. కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని 200 మంది అధికారులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. ఎన్నికల వ్యవస్థలో ప్రక్షాళన జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ సోమవారం సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించారు.
వివరాలు
దిల్లీని జైలుగా మార్చాల్సిన అవసరమేంటి?
భాజపా పట్ల దేశ ప్రజల్లో గత 12 ఏళ్లుగా వ్యతిరేకత ఉందని, అది ఇప్పుడు స్పష్టంగా బయటపడుతోందని రాహుల్ గాంధీ అన్నారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల సందర్భంగా దిల్లీలో భయానక వాతావరణాన్ని సృష్టించారని ఆరోపించారు.
నగరంలోని రోడ్లపై దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారని విమర్శించారు.
దేశ రాజధానికి ప్రజలు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
దిల్లీ మొత్తాన్ని కోటలా, జైలులా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.
ఆర్‌ఎస్‌ఎస్ గూండాలకు ఉన్న స్వేచ్ఛ దేశ యువతకు ఎందుకు లేదని నిలదీశారు.
భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులు మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ప్రస్తుత పరిణామాలతో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తమకు తెలుసని రాహుల్ వ్యాఖ్యానించారు.
వివరాలు
సీఈసీకి రాహుల్ సందేశం
ఆయన రాజీనామా చేయాల్సిందేనని, అప్పటివరకు తమ పోరాటాన్ని ఆపబోమని స్పష్టం చేశారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ నుంచి తనకు సందేశాలు వస్తున్నాయని రాహుల్ గాంధీ వెల్లడించారు.
ఆయన ఎంత ఒత్తిడిలో పనిచేస్తున్నారో తాము అర్థం చేసుకోగలమని పేర్కొన్నారు.
ఇప్పటికైనా అప్రూవర్‌గా మారి రాజీనామా చేయాలని జ్ఞానేశ్ కుమార్‌కు సూచించారు.
అదే ఆయన దేశానికి చేసే నిజమైన సేవ అవుతుందని, అలా చేస్తే తాము క్షమిస్తామని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
వివరాలు
సీజేఐని నిర్దేశిస్తున్నదెవరు?
దేశంలో ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందనే విషయాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దృష్టికి తీసుకెళ్లాలని భావించామని రాహుల్ తెలిపారు.
ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై ఆయనకు వివరించేందుకు అపాయింట్‌మెంట్ కోరినప్పటికీ, తమ విజ్ఞప్తిని తిరస్కరించారని చెప్పారు.
సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవాలని సీజేఐ సూచించినట్లు వెల్లడించారు.
అందుకే సోమవారం అత్యున్నత న్యాయస్థానం వరకు ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని స్పష్టం చేశారు.
అయితే, తమ విజ్ఞప్తిని సీజేఐ ఎందుకు తిరస్కరించారని, ఆయనను ఆ నిర్ణయం తీసుకునేలా నిర్దేశించింది ఎవరు అని రాహుల్ ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత పదవి కూడా రాజ్యాంగబద్ధమైనదేనని గుర్తుచేశారు.
వివరాలు
ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు పోరాటం
ప్రస్తుతం ప్రజలు,ప్రతిపక్షాలన్నీ ఒకవైపు ఉన్నాయని,మరోవైపు ప్రధాని మోదీ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా,జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, సీఈసీ జ్ఞానేశ్ కుమార్,ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఉన్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
వీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని అంతం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోదీకి తాను చెప్పేది ఒక్కటేనని,ఆయన ప్రభుత్వంలోని 200మంది అధికారులు తమతో టచ్‌లో ఉన్నారని రాహుల్ అన్నారు.
ఈ పోరాటం మోదీ,రాహుల్ మధ్య వ్యక్తిగత యుద్ధం కాదని స్పష్టం చేశారు.
దేశ యువత భవిష్యత్తును,రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని వివరించారు.
ఎన్నికల వ్యవస్థలో ప్రక్షాళన జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.
తాను పేర్కొన్న ఐదుగురు వ్యక్తులు న్యాయ విచారణను ఎదుర్కొనే వరకు వెనక్కి తగ్గబోమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.