ఏపీలో అవినాష్ రెడ్డి, తెలంగాణలో కవిత అరెస్టు అవుతారా? ఆందోళనలో అధికార పార్టీలు
సీబీఐ, ఈడీ విచారణలతో తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఇరు పార్టీలకు చెందిన కీలక నేతలు అరెస్టు అవుతారనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్‌ను పెంచేశాయి. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ అవినాష్ రెడ్డి శుక్రవారం మూడోసారి హాజరుకానున్నారు. ఈ కేసులో అవినాష్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైందని ప్రచారం జరిగింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందంటూ సీబీఐ ఆరోపిస్తోంది. ఇప్పటికే అవినాష్ ప్రమేయంపై బలమైన ఆధారాలను కోర్టుకు సీబీఐ సమర్చించింది. శుక్రవారం విచారణ ఉన్న నేపథ్యంలో గురువారం తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ కోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించారు.
వారి అరెస్టులు జరిగేతే తెలుగు రాజకీయాల్లో సంచలనమే
ఈ నెల 11వ తేదీన కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత దిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో లబ్ధిదారుల్లో కవిత ఒకరని, కీలక కుట్రదారు కూడా అని ఈడీ అభియోగాలు మోపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన వారి సాక్ష్యాల ఆధారంగా దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు కవితను అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవినాష్ రెడ్డితో పాటు కవిత అరెస్టులు జరిగితే తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారుతాయి. ఈ రెండు ఘటనలు జరిగితే అధికార పార్టీలకు పెద్ద ఎదురు దెబ్బలు అవుతాయి.