Pawan Kalyan: విశాఖ తీరంలో కాలుష్యానికి పరిశ్రమలే కారణం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంపై శాసన మండలిలో (AP Assembly Session) ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన సమాధానాలు ఇచ్చారు. శాసనసభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, పరిస్థితి మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం ఇచ్చే దిశలో ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. విశాఖలో భారీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి
పర్యావరణం,కాలుష్య ప్రభావాలను తగ్గించేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై పీసీబీ (పాల్యూషన్ కంట్రోల్ బోర్డు)అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. 2025 జనవరిలో ఈ నివేదిక వస్తుందని,ఆ తరువాత విశాఖలో తగిన చర్యలు చేపడతామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడం,కంప్రెస్డ్ బయోగ్యాస్ వాడకం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడం వంటి అంశాలపై పని జరుగుతోందన్నారు. అలాగే,థర్మల్ పవర్ ప్రాజెక్టుల ఫ్లైయాష్ వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు,సిమెంట్ తయారీకి ఈ ఫ్లైయాష్ వాడటం ద్వారా దీన్ని కట్టడి చేస్తామని చెప్పారు. విశాఖ,గుంటూరులో ఘన వ్యర్థాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని,ఈ పద్ధతిని ఇతర ప్రాంతాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఎన్జీవోల భాగస్వామ్యంతో కాలుష్య నివారణ చర్యలు చేపడతామని,డిసెంబర్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి,విశాఖలో ఈ చర్యలపై సమీక్ష చేస్తామని పేర్కొన్నారు.
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సంస్థను ప్రైవేటీకరించబోమని స్పష్టంగా చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసినప్పుడు కూడా ప్రైవేటీకరణ తలపెట్టవద్దని కోరినట్లు వివరించారు. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరించబోతున్నప్పుడు తమ ఉత్పత్తులను ఆపినట్లుగా తెలిపారు.